జలుబు.. దగ్గు.. జ్వరం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మొన్నటి వరకు ఎండ.. ఇప్పుడు చలి.. అదికూడా పొద్దంతా ఎండ.. రాత్రిపూట చలి.. వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు 35డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఒక్కసారిగా 24 డిగ్రీలకు పడిపోయాయి. నాలుగు రోజుల క్రితం రాత్రి ఉష్ణోగ్రతలు 20డిగ్రీలు ఉండగా, ప్రస్తుతం 18 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు అకస్మాత్తుగా అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరాలతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. పలువురు చిన్నారులు, వృద్ధులు జ్వరం, జలుబు, వాంతులతో బాధ పడుతున్నారు. ప్రతీ ఇంటా జ్వర పీడితులు ఉంటున్నారు. వాతావరణ మార్పులు, అపరిశుభ్రతతో జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరమే కదా అని కొందరు సొంత వైద్యం చేసుకోవడం.. ఆర్‌ఎంపీల వద్ద చికిత్సలు చేయించుకోవడం.. పరిస్థితి విషమించిన తర్వాత పెద్దాసుపత్రులకు వెళ్లడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జబ్బులు వచ్చాక ఇబ్బంది పడే బదులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా లబ్ధిపొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.
రోగులతో కిటకిట..
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. వారం క్రితం వరకు జిల్లా ప్రధానాసుపత్రులతో 700–800 ఓపీ నమోదు కాగా ప్రస్తుతం వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కొన్ని రోజులుగా 1,500 మందికిపైగా ఓపీలో వైద్యం చేయించుకుంటున్నారు. ఒక్కసారిగా రోగుల సంఖ్య పెరగడంతో వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల మొదటి వారంలో అంతంత మాత్రంగానే వచ్చిన రోగులు గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్నారు. ఈనెల 11 నుంచి 18 వరకు పది రోజుల వ్యవధిలోనే కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఔట్‌పేషెంట్ విభాగంలో ప్రతీరోజు 1200–1500 మంది వరకు వైద్యం పొందారు. ఇందులో చాలా మంది వైరల్ జ్వరాలతోనే వచ్చిన వారుండగా.. మిగిలిన వారు దగ్గు, జలుబు, జ్వరం బాధితులున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో ఓపీలు 15వ తేదీన 708, 16న 1,096, 18న 1,267గా నమోదైంది. జగిత్యాలలో సగటు ఓపీ 700 మంది, సిరిసిల్ల 600 ఓపీ కొనసాగుతోంది.
వారంరోజుల్లో కరీంనగర్
జీజీహెచ్‌లో ఓపీ ఇలా
11 1,529
12 1,411
13 1,140
14 1,126
15 514
16 935
18 1383
అకస్మాత్తుగా అనారోగ్యం
బాధితుల్లో అధికశాతం చిన్నారులే
వాతావరణ మార్పులే కారణమంటున్న డాక్టర్లు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీ
కిక్కిరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇలా
వీర్నపల్లి(సిరిసిల్ల) 12డిగ్రీలు
జూలపల్లి(పెద్దపల్లి) 13.7 డిగ్రీలు
గోవిందారం( జగిత్యాల) 13.1 డిగ్రీలు
ఆసిఫ్‌నగర్ కొత్తపల్లి(కరీంనగర్) 13 డిగ్రీలు
వాతావరణ మార్పులే
వాతావరణంగా చోటుచేసుకున్న అనూహ్య మార్పులతోనే ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు, వాంతులకు గురవుతున్నారు. వీటిని నిర్లక్ష్యం చేయడం, సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా తయారవుతున్నాయి. మూడు రోజుల కన్నా ఎక్కువ జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు ఉంటే వెంటనే ప్రభుత్వాసుపత్రికి వచ్చి చికిత్స పొందాలి.
– డాక్టర్ సాయిని నరేందర్, పల్మనాలజిస్టు, జీజీహెచ్, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment