No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, Nov 22 2024 1:34 AM | Last Updated on Fri, Nov 22 2024 1:34 AM

-

సాక్షి, పెద్దపల్లి:

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురిచేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లి పోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చు

పండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఒక ట్రిబ్యునల్‌ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్‌ కలెక్టర్‌ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్‌ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు.

ఆస్తిని తిరిగి పొందే హక్కు

నిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్‌ డీడ్‌ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్‌ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్‌ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్‌ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్‌ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement