నృసింహుని సేవలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో శుక్రవారం జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నీలిమా కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ముందుగా ఆలయం పక్షాన పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఆలయ ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, చిత్ర పటం, ప్రసాదాలు అందజేశారు. సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, అర్చకులు నంబి శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు.
మూల్యాంకనంపై దృష్టి సారించాలి
రాయికల్(జగిత్యాల): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యాసన సామర్థ్య మూల్యాంకనంపై దృష్టి సారించాలని డీఈవో రాము సూచించారు. శుక్రవారం రాయికల్ మండలం ఆలూరు, మూటపల్లి, భూపతిపూర్, తాట్లవాయి పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలల్లోని గ్రేడ్–1 విద్యార్థుల అంతర్గత నైపుణ్యాలకు అనుగుణంగా పాఠ్య పుస్తకాల రూపకల్పనకు ఈ మూల్యాంకనం తోడ్పడుతుందన్నారు. ఒకటో తరగతి విద్యార్థుల అభ్యాసన కృత్యాలను పరిశీలించి మరింత మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఎంఈవో రాఘవులు, తాట్లవాయి కాంప్లెక్స్ హెచ్‌ఎం బోగ రమేశ్, జాతీయస్థాయి విద్య ప్రవేశ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు సత్యనారాయణ, వినోద్, సతీశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలి
జగిత్యాలటౌన్: ఇరవై ఏళ్లుగా తక్కువ వేతనంతో సేవలందిస్తున్న తమను రాతపరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని 2వ ఏఎన్‌ఎంల సంఘం అధ్యక్షురాలు గాండ్ల మధురిమ డిమాండ్ చేశారు. 48గంటల నిరసనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తాము 45ఏళ్లు పైబడిన వారమేనని ఇప్పుడు పోటీ పరీక్ష రాయడం తమకు సాధ్యమయ్యే పని కాదన్నారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని కోరారు. మమత, జయప్రద, జిల్లాలోని పలువురు సెకండ్ ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం
జగిత్యాల: ప్రపంచ దేశాల్లోని ఫార్ముల ఈ రేస్‌ను కేటీఆర్ హైదరాబాద్‌కు తీసుకువచ్చి బ్రాండ్ ఇమేజ్ పెంచారని కానీ, ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ స్కామ్‌ల పేరిట ప్రజలను పక్కదారి పట్టిస్తుందని, ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో అసెంబ్లీలో చర్చ పెట్టమంటే ఎందుకు పెట్టడం లేదని, ఇది కక్ష సాధింపు చర్యేనన్నారు. ఓటుకు నోటు విషయంలో జైలుకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని కేసులు, ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, ప్రజల కోసం గొంతు విప్పుతున్న కేటీఆర్‌పై అక్రమంగా కేసు పెట్టారని, ఫార్ములా ఈ రేస్ అర్థం తెలుసా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్, గంగాధర్, గంగారెడ్డి, అమీన్‌బాయి, ప్రవీణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment