సీసీ కెమెరాల మధ్య ఇంటర్ ప్రాక్టికల్
● జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు గుర్తింపు ● ఎంపీసీలో 2,768 మంది.. ● బైపీసీలో 1,032 మంది విద్యార్థులు
కథలాపూర్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే నెల మూడో తేదీ నుంచి 22 వరకు జరగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో అక్రమాలకు తావివ్వకుండా ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించడంతోపాటు పరీక్షలు జరిగే కేంద్రాల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో పలుమార్లు ప్రాక్టికల్ పరీక్షలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ చివరి సమయంలో ఆచరణలోకి రాలేదు. ఈసారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం అధికారులు జిల్లాలో 47 కేంద్రాలను గుర్తించారు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల కోసం 37 కేంద్రాలు, వొకేషనల్‌కు 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెకండియర్ ఎంపీసీ విభాగంలో 2,768 మంది, బైపీసీలో 1,032 మంది, వొకేషనల్‌లో ఫస్టియర్ విద్యార్థులు 698 మంది, సెకండియర్ విద్యార్థులు 979 మంది ఉన్నారు. పరీక్షలను మూడు విడతల్లో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
పారదర్శకత పెరుగుతుంది
ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు కళాశాలలకు ఉత్తర్వులు జారీ చేశాం. విద్యార్థుల కోసం జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలు కేటాయించాం. ఈసారి ఇంటర్ ప్రాక్టికల్‌కు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటి ఏర్పాటుతో పారదర్శకత మరింత పెరుగుతుంది. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
– నారాయణ, ఇంటర్ విద్య నోడల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment