ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు
ఇల్లందకుంట: ఎన్ని అక్రమకేసులు పెట్టినా భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం తహసీల్దార్ రాణి ఆధ్వర్యంలో 29మంది లబ్ధిదారులకు రూ. 33,64,000 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తనపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఆడపడుచులకు ఇస్తామన్న తులం బంగారం ఎక్కడని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్సార్ పథకాలను కేసీఆర్ కొనసాగిస్తే, కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కొనసాగించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం రూ.4లక్షల కోట్లు అప్పుచేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసిందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు వస్తే.. గ్రామానికి వచ్చేది 21 ఇండ్లు మాత్రమేనన్నారు. కమలాపూర్ ఘటనను దృష్టిలో ఉంచుకుని తాహసీల్దార్ కార్యాలయంలో జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్ ఆధ్వర్యంలో వీణవంక ఎస్సై తోట తిరుపతి, ఇల్లందకుంట ఎస్సై రాజకుమార్‌తో పాటు 80మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment