సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్/వరంగల్ లీగల్: మానుకోట జిల్లా న్యాయస్థానం చరిత్రలో శుక్రవారం సంచలన తీర్పు వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జిల్లాకు చెందిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్, హత్య ఘటనలో 2 సంవత్సరాల 11 నెలల్లో తీర్పు వచ్చింది. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ముందుకు సాగిన కేసు అనేక పరిణామాలు, విచారణ, సాక్ష్యుల వాంగ్మూలం ఇలా ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్.. నిందితుడు మంద సాగర్‌ను దోషిగా నిర్ధారిస్తూ మరణ శిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ తీర్పు ఇచ్చారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు నుంచి కొనసాగుతున్న మానుకోట కోర్టులో.. ఉరి (మరణ శిక్ష) విధించడం ఇదే తొలిసారి. కేసు తుది వాయిదా, తీర్పు వెలువరించే సమయంలో కోర్టు హాల్ కిక్కిరిసింది. బాలుడి బంధువులు కోర్టు వద్దకు వచ్చారు. తీర్పు చెప్పిన వెంటనే అక్కడున్న వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాగా, తక్కువ కాలంలో కేసును ఛేదించిన పోలీసులను, న్యాయవాదులను న్యాయమూర్తి అభినందించారు.
న్యాయవాదులకు అభినందనల వెల్లువ
కేసు పక్కదారి పట్టకుండా, ముద్దాయికి శిక్ష పడేలా వాదించిన న్యాయవాదులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్ అభినందించారు. ఇందులో డీడీఓపీ సత్యనారాయణ, పీపీ చిలకమారి వెంకటేశ్వర్లు, పోక్సో కోర్టు పీపీ కీసర పద్మాకర్‌రెడ్డి సేవలను ప్రశంసించారు.
కేసులో పాలుపంచుకున్న వారికి అభినందనలు
దీక్షిత్‌రెడ్డి హత్య కేసును ఛేదించడంలో భాగస్వాములైన పోలీసులను ఎస్పీ అభినందించారు. ఇందులో అప్పటి డీఎస్పీ నరేశ్‌కుమార్, సీఐలు రవికుమార్, సతీశ్, ఎస్సైలు అరుణ్‌కుమార్, వెంకటాచారి, గోపీ, సీడీఓలు సంపత్‌రెడ్డి, మోహన్, లింగయ్య, పోలీసు సిబ్బంది శ్రీకాంత్, వెంకటరమణ, కుమారస్వామి, ఉదయభాస్కర్‌ను అభినందించారు.
న్యాయ వ్యవస్థ, పోలీసు లోగోకు క్షీరాభిషేకం
తన కుమారుడి హత్య కేసులో నేరస్తుడికి శిక్ష పడినందుకు బాలుడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కోర్టు ఎదుట న్యాయ వ్యవస్థ లోగో, పోలీస్ లోగోల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటికి క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా బాణసంచా పేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment