అంకితభావంతో పనిచేయాలి
జనగామ రూరల్: సంక్షేమ పథకాల అమలుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని, ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలును జనవరి 26న ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు. గ్రామ సభలను పక్కాగా నిర్వహించాలన్నారు. 16తేదీ (రేపటి) నుంచి 20 వరకు చేపట్టే క్షేత్రస్థాయి సర్వేలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా పూర్తిచేయాలని, అలాగే 16 నుంచి 20 వరకు లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు పక్కాగా జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, 21 నుంచి 25 వరకు డేటా ఎంట్రీలో తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులపై రిజిస్టర్‌లను, కంట్రోల్ రూంలను ఏర్పా టు చేసి, అర్జీలను స్వీకరించాలని, ఈ సర్వే, గ్రామ సభ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.
సాగు భూములకే రైతు భరోసా
పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 6,000 చొప్పున రెండు విడతలుగా రూ.12,000 భూ భారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ భూమికి (సాగు భూమి) మాత్రమే రైతు భరోసా చెల్లిస్తుందని, రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్ చేసిన భూములు, నాలా కన్వర్షన్ చేసిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, గోదాములు నిర్మించిన భూములు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, రాళ్లు, రప్పలు, గుట్టలతో నిండి, సాగుకు అనువుగా లేని భూములను గుర్తించి, తొలగించాలని సూచించారు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి రూ.6,000 చొప్పున రెండు విడతలుగా రూ.12,000 నగదు సాయం గాను కనీసం 20 రోజులు ఉపాధి హామీ పని దినాలు పూర్తిచేసుకున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.
కుల గణన ఆధారంగా రేషన్‌కార్డులు..
కొత్త ఆహార భద్రత కార్డుల పథకంలో భాగంగా బీపీఎల్ దిగువన ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని, కుల గణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని పేద కుటుంబాల జాబితా ప్రకారం పరిశీలించాలన్నారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీసీఎస్‌ఓ పర్యవేక్షకులుగా మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ బాధ్యులుగా ఉంటారన్నారు.
స్థలం ఉండి ఇల్లు లేనివారికి..
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జీఓ నంబర్ 7 ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న, ఇళ్లు లేనివారు, పూరి గుడిసెలు ఉన్నవారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్నవారు, నిర్మాణానికి స్థలం ఉన్నవారు అర్హులన్నారు. ఇందులో భాగంగా మట్టి గోడలు, పైకప్పు లేని వాటికి, వితంతువులకు, భూమిలేని వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకోసం ఈ నెల 18లోగా సూపర్ చెక్‌ను పూర్తిచేయాలని ఆదేశించారు. ఒక కుటుంబానికి ఒకటే ఇల్లు కేటాయించేందుకు గాను ఏఐ, జియో ట్యాగింగ్ ద్వారా డీడూప్లికేషన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, ఏఓ మన్సూర్, డీఆర్డీఏ వసంత, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు, సరస్వతి, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా లబ్ధిదారుల
ఎంపికను పూర్తిచేయాలి
అధికారులతో
కలెక్టర్ రిజ్వాన్ బాషా సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment