అద్దె భవనాల్లో అంగన్‌వాడీలు
జనగామ రూరల్: పూర్వ ప్రాథమిక విద్యతోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్‌వాడీలకు సొంతభవనాలు కరువయ్యాయి. అద్దె భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాల భవనాలు, ఇతర కార్యాలయాలతో అరకొర సౌకర్యాలతో వీటిని నెట్టుకొస్తున్నారు. బాలింతలు, చిన్నారులకు సేవలు అందిస్తున్న అంంగన్‌వాడీలకు చాలీచాలని వసతులతో అగచాట్లు తప్పడం లేదు. జిల్లాలో 695 సెంటర్లు ఉండగా ఇందులో 180 అంగన్‌వాడీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో సుమారుగా 35 వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటై దశాబ్ధాలు గడుస్తున్నా.. మెజార్టీ అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవనాలకు నోచుకోవడం లేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవన నిర్మాణాలు చేపట్టాలని ఆశగా ఎదురుచుస్తున్నారు.
ప్రతిపాదనలకే పరిమితం
గ్రామసభలు మొదలుకుని మండల సర్వసభ్య సమావేశాలు, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు, స్థాయీ సంఘాల సమావేశాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించే సమీక్ష సమావేశాలు.. ఇలా ఏ సమావేశం నిర్వహించినా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల విషయం చర్చకు వస్తుంది. సొంత భవనాలు కావాలంటూ కేంద్రాల నిర్వాహకులతో పాటు గతంలో ప్రజా ప్రతినిధులు ప్రతీ సమావేశంలో అడుగుతూనే ఉన్నారు. ప్రతీసారి ప్రతిపాదనలు పంపిస్తున్నామంటున్నారే తప్ప మంజూరుకి నోచుకోవడంలేదు.
అద్దెరూపంలో వేల రూపాయలు
అంగన్‌వాడీ పిల్లలను ఆకర్శించేందుకు అనేక రకాల వసతులతో పాటు సొంత భవనాలు కూడా అవసరం. జిల్లా వ్యాప్తంగా 180 వరకు ఆద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పిల్లలకు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడగా అటు అద్దె రూపంలో రూ.వేలాది రూపాయల ప్రజా ధనం వృథా అవుతుంది. దీంతో పిల్లల డ్రాపౌట్లు పెరుగుతున్నాయి. సంబంధిత జిల్లా అధికారులు సొంత భవనాలపై శ్రద్ధ చూపి అన్ని రకాల వసతులు కల్పించి అంగన్‌వాడీ సెంటర్లను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు
ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు : 656
మినీ అంగన్‌వాడీ కేంద్రాలు : 9
సొంత భవనాలు : 217
అద్దె భవనాలు : 180
ఫ్రీ అద్దె భవనాలు : 298
మొత్తం : 695
ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, బాలింతలు, చిన్నారులు
భవన నిర్మాణాలపై ప్రభుత్వంపై ఆశలు
జిల్లాలో 180 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగింపు
Comments
Please login to add a commentAdd a comment