సర్వేలో వేగం పెంచాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక సర్వేలో మరింత వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న సర్వేపై శనివారం రెవెన్యూ, పంచాయతీ రాజ్, మండల ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేలో తప్పులు లేకుండా బాధ్యతగా, పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడి వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన డేటాను సక్రమంగా నమోదు చేయాన్నారు. టీములు ప్రజలతో నేరుగా మమేకమై సమగ్ర సమాచారం సేకరించాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు లబ్ది చేకూరేలా చూడటమే కర్తవ్యమని కలెక్టర్ సూచించారు. రైతు భరోసా పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యోగ్యమైన భూములకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. వ్యవసాయానికి పనికిరాని భూముల వివరాలను నమోదు చేయాలన్నారు. సర్వే 20వ తేదీ వరకు పూర్తి చేయాల్సి ఉందన్నారు. రానున్న రెండు రోజులు మండల ప్రత్యేక అధికారులు సర్వేపై మరింత ఫోకస్ చేయాలని వెల్లడించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, భూపాలపల్లి ఆర్డీఓ రవి, మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
వేగవంతంగా చేస్తున్నాం
రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం జిల్లాలో చేపడుతున్న సర్వేను వేగవంతం చేశామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైతే మళ్లీ దరఖాస్తులు స్వీకరించి పరిశీలన చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారిలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అర్హులుగా ఉన్న ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. మంత్రి పలు సూచనలు, సలహాలు అందించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం వెల్లడించిన జాబితా పర్మనెంట్ కాదని, అర్హుల పేర్లు లేకుంటే ప్రభుత్వం సూచించిన మేరకు మళ్లీ దరఖాస్తులు స్వీకరించి పరిశీలిస్తామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment