ఇంటికో డప్పుతో కదలాలి
భూపాలపల్లి రూరల్: ఎస్సీ వర్గీకరణ కోసం ప్రపంచానికి తెలిపే విధంగా వేల గొంతులు, లక్షల డప్పులతో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్‌లో చేస్తున్న మహాసభకు రాష్ట్రంలోని మాదిగలు ప్రతి ఇంటి నుంచి డప్పుతో కదలిరావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ అంబాల చంద్రమౌళి అధ్యక్షతన శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీల్లో 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణకు అనుకూలంగా ఉంటే మాలకులం మాత్రం వర్గీకరణను అడ్డుకుంటుందని ఆరోపించారు. వర్గీకరణకు అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం కోర్టుకు లేఖ ఇచ్చిందని, దీంతో కోర్టు కూడా వర్గీకరణకు అనుకూలంగా 2024ఆగస్టు 1న తీర్చు ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. వర్గీకరణ విషయంలో పార్టీలోని మాల నాయకుల ఒత్తిడితో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని మాల నాయకులు పలుకుబడి, డబ్బుతో వర్గీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సారి వర్గీకరణ జరగపోతే మళ్లీ అవకాశం లేదన్నారు. కాబట్టి జిల్లాలోని ప్రతిఒక్కరు సభకు హాజరుకావాలని కోరారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే లింగయ్య, నాయకులు నోముల శ్రీనివాస్, గాజుల భిక్షపతి, బొల్లిబాబు, దోర్నాల సారయ్య, భద్రయ్య, చంటి తదితరులు పాల్గొన్నారు.
వర్గీకరణ ఇప్పుడు కాకపోతే మరోసారి గెలవలేం
సన్నాహక సదస్సులో మంద కృష్ణమాదిగ
Comments
Please login to add a commentAdd a comment