పకడ్బందీగా సర్వే నిర్వహించాలి
భూపాలపల్లి అర్బన్: అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని జిల్లా ప్రత్యేకాధికారి వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి, భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీలో జరుగుతున్న రైతు భరోసా, ఆహార భద్రతా కార్డుల విచారణ ప్రక్రియను శనివారం ఆయన తనిఖీ చేశారు. నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చేస్తున్న ఈ సర్వేలో అర్హులైన ఏ ఒక్కరు తప్పిపోకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చాలని సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న విచారణ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. పొరపాటుకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సాగుకు యోగ్యమైన భూములను సర్వేనంబర్ల వారీగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించడం జరుగుతుందని, ఆహార భద్రతా కార్డులకు అర్హత కలిగిన కుటుంబాలకు అందించేందుకు వీలుగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు. ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనుందని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఎస్‌ఓ శ్రీనాద్, భూపాలపల్లి, గణపురం తహసీల్దార్లు శ్రీనివాసులు, సత్యనారాయణస్వామి పాల్గొన్నారు.
పారదర్శకంగా సర్వే
కాటారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపడుతున్న సర్వే పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. కాటారం మండలం అంకుషాపూర్, బయ్యారం గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న సర్వేను అదనపు కలెక్టర్ శనివారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, ఏఈఓ దివ్యజ్యోతి, సర్వే టీం సభ్యులు ఉన్నారు.
సర్వే పరిశీలన
మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో కొనసాగుతున్న సర్వేను శనివారం అదనపు కలెక్టర్ అశోకుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్‌ఓ శ్రీనాథ్, తహసీల్దార్ రవికుమార్ ఏఓ శ్రీజ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రత్యేకాధికారి వినయ్‌కృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment