15 కిలోల పంచలోహ విగ్రహం అందజేత
రాజోళి: మండల కేంద్రంలో కొలువైన భ్రమరాంబ అడివేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా మాత పార్వతి, మహాగణపతి ఆలయాలను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గుజరాతి ఈశ్వరప్ప,ఆయన కుమారుడు నాగరాజు కుటుంబ సభ్యులు 15 కేజీల వినాయక విగ్రహాన్ని అందజేశారు. వచ్చే నెలలో విగ్రహాల ప్రతిష్ట చేపట్టనున్న నేపథ్యంలో ఈ విగ్రహాన్ని శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందచేశారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రావ్,గోపాల్ రెడ్డి,చంద్రగౌడ్, అర్చకులు వినోద్,బసవరాజు తదిదరులు పాల్గొన్నారు.
ఆదిశిలా క్షేత్రంలో
భక్తుల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రమేషాచారి, రవిచారి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే సద్దలోనిపల్లి కృష్ణస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్ప స్వామి ఆలయాలతో పాటు వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మల్దకల్, సద్దలోనిపల్లి ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం
అయిజ: మున్సిపాలిటీలో ఏళ్లుగా సమస్యలు తిష్ట వేశాయని, ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని, సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం పట్టణ బీజేపీ అధ్యక్షుడు భగత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యర్తలు మున్సిపల్ కార్యాలయం ముందు ఒక రోజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లాడారు. అయిజ గ్రామ పంచాయతీనుంచి నగరపంచాయతీగా, మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా పట్టణం అభివృద్ధి చెందలేదని, మౌళికవసతులు ఏర్పాటు చేయలేదని అన్నారు. ఏటా సుమారు రూ. 2 కోట్లు ఆస్తిపన్ను ప్రజలనుంచి వసూలు చేస్తున్నారని, సమస్యలు మాత్రం పరిష్కరించడంలేదని ఆరోపించారు. అయిజను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయడంతోపాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ కార్యాలయం, కోర్టు, 50 పడకల ఆస్పత్రి ఏర్పాటుచేయాలని, అలాగే మున్సిపాలిటీ కార్యాలయ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఎల్‌ఈడీ బల్బులు, ముఖ్య కూడళ్ల వద్ద హైమాస్ట్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. వార్డుల సంఖ్యను 30కు పెంచాలని, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, కర్నూలు–రాయిచూరు రోడ్డుపై ఉత్తనూరు చౌరస్తా నుంచి ఉప్పల చౌరస్తా వరకు డివైడర్‌లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోపాల కృష్ణ, భీమసేనరావు, వెంకటేష్, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.6,621
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శనివారం 1,631 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6621, కనిష్టం రూ.3099, సరాసరి రూ. 5689 ధరలు పలికాయి. అలాగే, 19 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5539, కనిష్టం రూ. 5109, సరాసరి రూ. 5301 ధర లభించాయి. 182 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.7026, కనిష్టం రూ. 3236, సరాసరి రూ. 6809 ధరలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment