పంటలు ఎండనివ్వం
రాజోళి: త్వరలోనే ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు అందుతుందని, రైతుల పంటలు ఎండిపోనివ్వమని, అవసరమైతే మళ్లీ సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో ఏపీ మంత్రులతో చర్చలు జరిపి ఆర్డీఎస్ రైతులకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. శనివారం రైతులతో కలిసి ఏపీ–తెలంగాణ సరిహద్దులో ఉన్న సుంకేసుల డ్యాం దగ్గరకు వెళ్లి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం తుమ్మిళ్ల గ్రామంలోని నదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్డీఎస్ రైతుల ఇబ్బందులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఏపీ మంత్రులతో మాట్లాడి, ఇరు ప్రాంతాల వారు కలిసి ఇండెంట్ పెట్టినట్లు తెలిపారు. కాగా.. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న 3,600 క్యూసెక్కులకు పైగా నీటిలో ఏపీ ప్రభుత్వమే ఎక్కువగా వాడుకుంటుందని ఆయన అన్నారు. సుంకేసుల దగ్గర గల కేసీ కెనాల్ ద్వారా నీరు ఏపీకి ఎక్కువగా వెళ్లిపోతుందని, దీని వల్లనే బ్యాక్ వాటర్ ఉండాల్సిన తుమ్మిళ్ల దగ్గర గత రెడు రోజుల కంటే ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత తక్కువగా ఉందని అన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా మోటార్లకు నీరు అందడం లేదని తెలిపారు. ఈ విషయమై ఆయన తుమ్మిళ్ల ఎత్తిపోతల నుండి ఏపీ నీటి పారుదల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహాన్ని తగ్గించుకోవాలని చెప్పారు.
త్వరలో ‘మల్లమ్మకుంట’లో కదలిక
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో కీలక పాత్ర పోషించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించామని, త్వరలోనే దానిపై కదలిక తీసుకువచ్చి రైతులకు శుభవార్త చెప్తామని అన్నారు. రిజర్వాయర్లను పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని ఆయన తెలిపారు. నీలి శ్రీనువాసులు, దొడ్డెప్ప, కుమార్, సీతారామి రెడ్డి, ఎల్లా రెడ్డి, ఎనుముల నాగరాజు,దస్తగిరి,వెంకటేశ్వర్లు,హసేన్,రషీద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment