పంట పండేనా?
●
మార్చి వరకు నీరందించాలి..
ప్రస్తుతం మొక్కజొన్న, సీడు జొన్న పంటలు కంకి దశలో వున్నాయి. నెల రోజులపాటు నీటి తడు లు ఇవ్వాల్సి ఉంటుంది. మార్చి 15 వరకు నీరందితేనే పంటలు పూర్తిస్థాయిలో పండే అవకాశం ఉంది. గత నెలలో 15 రోజులపాటు నీరందక పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు పరిస్థితి అలా జరిగితే ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోతారు. మార్చి 15 వరకు ఆర్డీఎస్ కెనాల్ ద్వారా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి. – గోవర్ధన్‌రెడ్డి,
ఆయకట్టు రైతు, తనగల, వడ్డేపల్లి మండలం
రైతులకు న్యాయం
చేయాలి..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటాగా తుంగభద్ర డ్యాం నుంచి ఒకే సారి ఇండెంట్ పెట్టాలి. మన వాటాగా ప్రతీసారి ఒక టీఎంసీ పెట్టడం వల్ల నదిలో ఇంకిపోవడం.. ఎగువన ఉన్న కర్నాటక రైతులు వాడుకోవడంతో దిగువన ఉన్న తుమ్మిళ్ల లిఫ్ట్‌కు నీరు చేరే అవకాశం ఉండటం లేదు. కేసీ కెనాల్, ఆర్డీఎస్ అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసుకుని ఇద్దరు ఒకే సారి ఇండెంట్ పెట్టి రైతులకు న్యాయం చేయాలి. – మద్దిలేటి, ఆయకట్టు రైతు,
రామాపురం, వడ్డేపల్లి మండలం
నాలుగో ఇండెంట్ పెడతాం..
తుంగభద్ర బోర్డులో నాలుగో ఇండెంట్ పెట్టే విషయమై చర్చించేందుకు బుధవారం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆర్డీఎస్ వాటాగా రెండు టీఎంసీలు టీబీ బోర్డులో పెట్టడానికి అవకాశం ఉంది. నాలుగో ఇండెంట్ ఎప్పుడు పెట్టే విషయంపై అధికారులతో చర్చిస్తాం. అంతేగాక కేసీ కెనాల్ అధికారులతో మాట్లాడి ఒకే సారి ఇండెంట్ పెట్టేందుకు కృషిచేస్తాం.
– శ్రీనివాసులు, ఆర్డీఎస్ ఈఈ
తుంగభద్ర నదిలో తగ్గిన నీటి ప్రవాహం
శాంతినగర్: ఆర్డీఎస్ కెనాల్ కింద యాసంగి పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆర్డీఎస్, తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో సుమారు 37వేల ఎకరాల్లో మిరప, వేరుశనగ, సీడు జొన్న, మొక్కజొన్న, కూరగాయలను పండిస్తున్నారు. అయితే ఆర్డీఎస్ కెనాల్‌లో నీటిపారుదల నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పది రోజుల క్రితం వారంపాటు రాష్ట్ర వాటాగా విడుదల చేసిన ఒక టీఎంసీ నీరు ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వద్దకు మాత్రమే చేరుకుని నిలిచిపోయాయి. అక్కడి నుంచి ఆర్డీఎస్ కెనాల్‌కు నీటిని వదలగా.. డిస్ట్రిబ్యూటరీ 22 వరకు వచ్చి ఆగిపోయాయి. దిగువన ఉన్న డీ–22 నుంచి డీ–40 వరకు సాగునీరు అందకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీ కెనాల్ వాటాగా విడుదల చేసిన రెండు టీఎంసీల నీటితో తుమ్మిళ్ల లిఫ్ట్ వద్దకు నీరు చేరింది. ప్రస్తుతం వారం రోజులుగా సాగునీరు అందుతోంది. హెడ్‌వర్క్స్ వద్ద నాలుగు ఇంచుల మేర ఓవర్ ఫ్లో (2357 క్యూసెక్కులు) ఉంది. మరో మూడు రోజులపాటు తుమ్మిళ్ల లిఫ్ట్‌కు సాగునీరందే అవకాశం ఉందని.. ఆ తర్వాత పరిస్థితి ఏమిటని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
నీరందకపోతే ‘తుమ్మిళ్ల’ బంద్
తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం రోజురోజుకూ తగ్గుతోంది. దీంతో తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద ఏర్పాటుచేసిన సంపునకు నీరందే వరకు మాత్రమే లిఫ్ట్ మోటారు పనిచేస్తుంది. నీరందకపోతే మోటార్‌ను నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీ బ్యాక్‌వాటర్ ఉండటంతో మోటార్‌ను రన్నింగ్‌లో ఉంచారు.
ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద 4 ఇంచులకు పడిపోయిన ఓవర్ ఫ్లో
మరో మూడు రోజులు మాత్రమే తుమ్మిళ్ల లిఫ్ట్‌కు నీరందే అవకాశం
ఆందోళనలో ఆయకట్టు రైతులు
ఇండెంట్ పూర్తవ్వడంతో..
టీబీ డ్యాం నుంచి విడుదల చేసిన నీటితో రాజోళిబండ హెడ్‌వర్క్స్ (ఆనకట్ట) వద్ద మంగళవారం 4 ఇంచుల మేర ఓవర్‌ఫ్లో ఉన్నట్లు ఆర్డీఎస్ అధికారులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఇండెంట్‌లు పూర్తవ్వడంతో ఎగువ (టీబీ డ్యాం) నుంచి నీటి ప్రవాహం నిలిచిపోయిందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో మరో మూడు రోజులు మాత్రమే సాగునీరు అందుతుందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment