కనులపండువగా అంజన్న రథోత్సవం
ధరూరు: మండలంలోని పెద్ద చింతరేవుల ఆంజనేయస్వామి రథోత్సవం మంగళవారం కనులపండువగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభోత్సవం, పల్లకీసేవ కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి స్వామివారి రథోత్సవం కమనీయంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఆంజనేయస్వామి కలువుదీరగా.. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా హనుమాన్ నామస్మరణ మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్సవాల్లో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత పాల్గొని పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈఓ కవిత, ధర్మకర్త గిరిరావు చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment