‘చేనేత అభయహస్తానికి’ దరఖాస్తు చేసుకోండి
గద్వాల: తెలంగాణ చేనేత అభయహస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు నిధి పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కార్మికులకు పొదుపు, సాంఘిక భద్రత కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికుల సహకార రంగం, సహకారేతర రంగంలో ఉన్నటువంటి వారితో పాటు అనుబంధ కార్మికులందరికీ పథకం వర్తిస్తుందని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారు కనీసం 50 శాతం చేనేత వృత్తి నుంచి ఆదాయం పొందాలన్నారు. ప్రతినెలా 15వ తేదీలోగా తమ వేతనం నుంచి 8 శాతం ఆర్‌డీ–1లో జమ చేసుకోవాలని తెలిపారు. తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే 16 శాతం వేతనాలను సంబంధిత ఆర్‌డీ–2లో 24 నెలలలోపు తీసుకునేందుకు అనుమతించబడదన్నారు. అర్హత కలిగిన చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
టెండర్ల ఆహ్వానం
గద్వాల: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12 బీసీ ఫ్రీ మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ వనతిగృహాలకు అవసరమైన 18 రకాల వంట పాత్రలు, ఇతర సామగ్రి సరఫరా నిమిత్తం ట్రేడ్ లైసెన్స్ కలిగిన వ్యాపారుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వ్యాపారులు టెండర్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 5 వేలు, ఈఎండీ రూ. 10 వేలను జిల్లా బీసీ డెవలప్‌మెంట్ అధికారి, జోగుళాంబ గద్వాల వారి పేరుపై డీడీ చెల్లించాలని సూచించారు. టెండర్ షెడ్యూల్ ఫారాలు ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయన్నారు. 12న మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లను తెరవనున్నట్లు పేర్కొన్నారు. గడువు తీరిన తర్వాత వచ్చే టెండర్లను స్వీకరించరని తెలిపారు.
రైతులకు విధిగారశీదులు ఇవ్వాలి
కేటీదొడ్డి: ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసే రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. మంగళవారం కేటీదొడ్డి మండలం పాగుంట, కొండాపురం, కుచినెర్ల, చింతలకుంట, నందిన్నె గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్ రిజిస్ట్రర్లు, బిల్లులను పరిశీలించారు. దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. డీఏఓ వెంట ఏఓ సాజీద్ రెహమాన్, ఏఈఓలు ఉన్నారు.
పోలీసు క్రీడాకారులకు అభినందన
గద్వాల క్రైం: కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన తెలంగాణ పోలీసు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2025లో ప్రతిభకనబరిచి.. పతకాలు సాధించిన జిల్లా పోలీసు క్రీడాకారులను మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. తైక్వాండో 87 కేజీల విభాగంలో రామాంజనేయులు, 68 కేజీల విభాగంలో రవికుమార్ గోల్డ్ మెడల్స్ సాధించారు. స్విమ్మింగ్‌లో వీర ప్రతాప్‌రెడ్డి కాంస్య పతకం పొందారు. మెడల్స్ సాధించిన సిబ్బందిని ఎస్పీతో పాటు పలువురు అభినందించారు.
నేటి నుంచి కందుల కొనుగోలు
అయిజ: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డులో బుధవారం నుంచి కందులను కొనుగోలు చేయనున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకనటలో తెలిపారు. కందులకు ప్రభుత్వం రూ. 7,550 మద్దతు ధర ప్రకటించిందని.. కొనుగోలు కేంద్రంలో కందులు అమ్మే రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ధ్రువపత్రంతో పాటు ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. కందుల్లో 12 శాతం తేమ మించకుండా ఉండాలన్నారు. తాలు గింజలు, చెత్తా చెదారం లేకుండా శుభ్రపరిచి ఉండాలని తెలిపారు. ఒక్కో ఎకరానికి 3.30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment