నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
గట్టు: వ్యవసాయం, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ తిరుపతిరావు అన్నారు. మంగళవారం మండలంలోని మల్లాపురం నుంచి ఆలూరు వరకు సుమారు రూ. కోటి నిధులతో చేపట్టిన 33 కేవీ విద్యుత్ లైన్ పనులతో పాటు మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు రూ. 50 కోట్లతో విద్యుత్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 11కేవీ ఫీడర్లపై 150 యామ్స్ కంటే ఎక్కువ లోడు పడకుండా, 33 కేవీ ఫీడర్‌పై 300 యామ్స్ కంటే ఎక్కువ లోడు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఓవర్ లోడ్‌ను తగ్గించేందుకు అవసరమైన పనులు చేపడుతున్నామన్నారు. ఓవర్ లోడ్ కారణంగా తరచూ తెగిపోయే వైర్లను కూడా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి.. వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యుత్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
● కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కుసుమ్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఈ తిరుపతిరావు కోరారు. ఈ పథకంతో రైతులు తమ వ్యవసాయ పొలాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రైతులు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఎస్‌ఈ వెంట ఏడీఈ గోవిందు, కన్‌స్ట్రక్షన్ ఏడీఈ సత్తార్ బాషా, ఏఈ చెన్నయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment