ఆగని ధరవు
● ఇబ్బందులు పడుతున్నాం
పండగలు వస్తున్నాయంటే నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. గత నాలుగు నెలలుగా నిత్యావసర వస్తువులు, పప్పులు, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దుకాణానికి వెళ్లి సరకులు కొనుగోలు చేయాలంటే భయమేస్తోంది. ప్రభుత్వం కందిపప్పు, బియ్యం అమ్మకాలకు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ తెరిచినా రేట్లలో పెద్దగా తేడా లేదు. రేషన్ షాపుల ద్వారా గతంలో మాదిరిగా సబ్సిడీ రేట్లకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తే పేదలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
–ఆతం భద్రం, కాకినాడ
● రేట్లు పెరిగినా కొనుగోలు చేయక తప్పదు
అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ధరలు తగ్గించకపోగా రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నారు. ఈ ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలం అయింది. నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగి భారంగా మారినా కొనుగోలు చేయక తప్పడం లేదు. రెండు నెలల క్రితం బియ్యం, కంది పప్పు, ఇప్పుడు పామాయిల్‌ను ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు చేస్తామని ప్రకటించారు. రైతుబజార్ ఎక్కడో దూర ప్రాంతంలో ఉండడం, అక్కడ నాణ్యమైన సరకు ఉండకపోవడంతో ప్రజలు వాటిని దరి దాపులకే వెళ్లడంలేదు. ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందించే సరుకులు పేదలకు అంటుబాటులో లేవు. రేషన్ షాపుల్లో గతంలో మాదిరిగా సబ్సిడీ ధరలకు నిత్యావసర సరకులు అందించాలి.
– జగడం శ్రీహరి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్, తూరంగి
● నిత్యావసర వస్తువుల ధరలు
నియంత్రించలేని కూటమి ప్రభుత్వం
● ప్రత్యేక కేంద్రాల్లో కందిపప్పు, బియ్యం, పామాయిల్ తక్కువ ధరకే అంటూ ప్రచారం
● నాణ్యత లేకపోవడంతో కొనేందుకు ప్రజల విముఖత
● మండల కేంద్రాల్లో నేటికీ తెరచుకోని ప్రత్యేక కేంద్రాలు
కాకినాడ సిటీ: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కందిపప్పు, బియ్యం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే చేతులెత్తేసింది. ఓ వైపు కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కందిపప్పు ధర డబుల్ సెంచరీ దగ్గరకు చేరింది. ఈ తరుణంలో ధరలు దించుతామంటూ ప్రచారం చేసిన ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక కేంద్రాలు, రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం ఇస్తామంటే ఆశపడిన పేద, మధ్యతరగతి ప్రజలు వాటి నాణ్యత, ధరలు చూసి పెదవి విరుస్తున్నారు. ఇంతోటి సంబరానికి అంతటి డప్పెందుకని బహిరంగంగానే విమర్శిస్తున్నాను. ఇదిలా ఉంటే ఇప్పుడు పామాయిల్ అమ్మకానికి ప్రత్యేక కౌంటర్లు తెరుస్తామని, పామాయిల్ (850 గ్రాములు) ధర రూ. 110, సన్‌ఫ్లవర్ ఆయిల్ (910 గ్రాములు) ధర రూ. 124లు అమ్మే విధంగా ధరలు నిర్ణయించినట్టు ప్రకటించారు. పామాయిల్ బయట మార్కెట్‌లో కిలో రూ. 110కి, సన్‌ఫ్లవర్ రూ.134కు దొరుకుతుంటే ప్రత్యేక కౌంటర్లలో ధర రూ.110, రూ.124లు అమ్మే విధంగా నిర్ణయించడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు.
మాటలకే పరిమితమైన నాణ్యత
మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో కందిపప్పు, బియ్యం అందించే ప్రత్యేక కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు ఆగస్టు నెలలో అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ఆ కేంద్రాలతో ప్రజలకు ఒనగూరిందేమీ లేదని, ఇప్పుడు పామాయిల్ అమ్మకాల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కౌంటర్ల వల్ల ప్రజలకు ఏ ఉపయోగం ఉండదన్న అభిప్రాయం జిల్లా అంతటా వినిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన ధరకు కందిపప్పు, బియ్యం ప్రజలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పట్టించుకున్న దాఖాలాలు లేవు. కేజీ కందిపప్పు రూ.160, స్టీమ్ బియ్యం కేజీ రూ.49, బీపీటీ పచ్చి బియ్యం రూ.48 వంతున ప్రత్యేక కేంద్రాల్లో అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే బయట మార్కెట్‌లో కందిపప్పు రకాలను బట్టి రూ.160 నుంచి రూ.225 వరకు లభిస్తున్నాయి. అదే విధంగా బియ్యం కూడా రకాలను బట్టి రూ.42 నుంచి లభ్యమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కందిపప్పు, బియ్యం నాణ్యత లేకపోవడంతో పాటు ధరలలో వ్యత్యాసం నామమాత్రంగా ఉండటంతో ప్రజలు వాటి వైపు వెళ్లడమే మానేశారు.
కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం
జిల్లాలో పలు మండలాల్లో మొదటి నెలలో ప్రత్యేక కేంద్రాలకు పప్పు, బియ్యం సరఫరా కాలేదు. రెండో నెలలో తూతూ మంత్రంగా కందిపప్పు, బియ్యం చేరాయి. అదీ నాణ్యత లేని రెండో రకం బియ్యం, కందిపప్పు సరఫరా చేశారని వినియోగదారులు అంటున్నారు. ఒక్క కాకినాడ రైతుబజారు మినహా జిల్లాలో ఏ ఒక్క మండలంలోనూ కందిపప్పు, బియ్యం పంపిణీలకు ప్రత్యేక కౌంటర్లు తెరచుకోలేదు. కొన్ని మండలాలకు సరకు పంపేందుకు రవాణా చార్జీల చెల్లింపుల్లో స్పష్టత లేక సరకుల పంపిణీ ఆగినట్టు సమాచారం. పెద్దాపురం, జగ్గంపేట, తుని, పిఠాపురం, తాళ్లరేవు, కాకినాడ రూరల్ ప్రాంతాల్లో కందిపప్పు, బియ్యం పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు తెరచుకోనే లేదు. అదేవిధంగా ఇప్పుడు నూనె (పామాయిల్) సరఫరా కూడా ఉంటుందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. తమకు ప్రత్యేక కేంద్రాల ద్వారా కందిపప్పు, నూనె, బియ్యం పంపిణీ అమ్మకాలు వద్దని, నేరుగా రేషన్ షాపుల్లోనే వీటిని గతంలో మాదిరిగా ప్రభుత్వం నిర్ణయించిన ఽసబ్సిడీ ధరలకు అందించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ రైతుబజార్లో కందిపప్పు, బియ్యం అమ్మకాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో వీటిని ప్రజలు కొనుగోలు చేయని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎప్పుడు చూసినా ఆ షాపు ఖాళీగానే దర్శనమిస్తోంది.
రేషన్ దుకాణాల్లో సరకులేవీ?
రేషన్ కార్డుదారులకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేసున్న రాష్ట్ర ప్రభుత్వం కందిపప్పు, పంచదార, గోధుమ పిండి, పామాయిల్ తదితర సరుకుల పంపిణీకి ఎగనామం పెట్టడంపై విమర్శలు వ్యక్తమవున్నాయి. రేషన్ దుకాణాల్లో రూ.67కే లభించాల్సిన కేజీ కందిపప్పును ప్రత్యేక కేంద్రాల పేరుతో రూ.160కు విక్రయించడమేంటని ప్రజలు వేస్తున్న ప్రశ్నకు సమాధానమిచ్చే వారే లేరంటున్నారు. గతంలో రూ.50కే ఇచ్చే పామాయిల్ 910 గ్రాముల ప్యాకెట్ ఇప్పుడు రూ.110 అంటూ ప్రచారం చేస్తున్నారంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సరకులను డీలర్ షాపుల ద్వారా అమ్మాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment