నిబంధనలు తుస్..
● బాణసంచా అక్రమ వ్యాపారానికి
కొండంత అండ
● నగర నడిబొడ్డులో చకచకా ఏర్పాట్లు
● అనుమతులు రాకముందే
దుకాణం నిర్మాణం
కాకినాడ క్రైం: ప్రజల భద్రతను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. లాభార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కాకినాడ మెయిన్ రోడ్డులో రద్దీగా ఉండే టిప్సీ టాప్సీ, నీరూస్ అనే రెండు దుస్తుల షోరూంల మధ్య సుమారు 700 గజాల విస్తీర్ణంలో ఓ బాణసంచా దుకాణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆదివారం ఆ దుకాణంలో బాణసంచా సామగ్రి సైతం నిల్వ చేయడం గమనార్హం. కాగా దుకాణం బయట కాకినాడ నగర ఎంఎల్‌ఏ వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు చిత్రాలతో ఫ్లెక్సీలు దర్శనమివ్వడం, కార్లలో బాడాబాబులు ఖద్దరు చొక్కాలతో దిగి దుకాణ ఏర్పాట్లు చూసుకుని వెళ్లడం చర్చనీయాంశమైంది. శ్రీ గణపతి ఫైర్ వర్క్స్ పేరుతో దుకాణ ఏర్పాటు అనుమతులు కోసం ఎంఎల్‌ఏ కొండబాబు కీలక అనుచరుడు పూర్ణ మరో అనుచరుడు ఎం.శివరామకృష్ణ పేరుతో దరఖాస్తు చేశాడు. వడ్డించేవాడు మన వాడైతే అన్న చందంగా అనుమతులు రావనే ప్రశక్తే లేదన్న ధీమాతో వ్యవహరిస్తున్నారు. పక్కనే షోరూంల యాజమానులను బెదించి మరీ ఎన్‌వోసీలు డిమాండ్ చేస్తుండడం స్థానికులను విస్తుగొలుపుతోంది. ఈ దుకాణం ఏర్పాటుపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా దరఖాస్తు అందిందనీ, ఫైర్, పోలీస్, మున్సిపాలిటీ పర్యవేక్షణ జరుగుతుందని చెప్పారు. ఆ విభాగాల అధికారులు మాత్రం ముందు ఎవరు అనుమతి ఇస్తే దాని మాటున తమ అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. దీపావళికి ఒకటి రెండు రోజుల ముందు అనుమతులు ఇచ్చేసి తరువాత వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. అనుకోని దుర్ఘటన జరిగి అగ్నిప్రమాదాలు జరిగితే రెండు షోరూంల మధ్య నుంచి ఎవరూ బయటపడే ప్రశక్తి లేదు. ఫైర్ ఇంజిన్‌ని స్టాండ్ బై ఉంచే పరిస్థితి కూడా ఆ ప్రాంతరంలో లేదు. ప్రజల తాకిడి దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించడం ముమ్మాటికీ ప్రజల ప్రాణాలతో చెలగాలమేనన్న విమర్శలు స్థానికులలో వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment