దివ్యాంగుల విద్యార్థులకు 18 ఏళ్లుగా సేవ
నేడు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం
పెద్దాపురం: ఒకరిద్దరు బిడ్డలను సాకాలంటేనే ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతున్న ఈ రోజుల్లో సుమారు 150 మంది దివ్యాంగులు, మానసిక చిన్నారుల (విభిన్న ప్రతిభా వంతుల) ఆలనా పాలనా చూసేందుకు వారు ముందుకువచ్చారు. వారి ఆకలి తీర్చిన అమ్మానాన్నలుగా సేవలందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీశాంతి వర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నిర్వాహకులు రాయవరపు వీరబాబు, సత్య దంపతులు.
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం తిరుపతి గ్రామానికి చెందిన రాయవరపు వీరబాబుకు చిన్నతనంలోనే ఓ కాలికి పోలియో సోకింది. తనలాగే వికలాంగత్వంతో బాధపడే వారి కోసం ఏదైనా చేయాలని భావించాడు. కంప్యూటర్ విద్యార్థిని సత్య వీరబాబును ప్రేమించింది. అతడి భావాలు, ఆలోచనలు నచ్చడంతో తల్లిదండ్రుల అనుమతితో 2002లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. భర్త ఆశయాన్ని విని తాను కూడా చేదోడు వాదోడుగా నిలవాలనుకుంది భార్య సత్య. మానసికంగా, అంగవైకల్యంతో బాధపడే వారి కోసం ఏదైనా చేయాలని తలపించారా దంపతులు.
వారి ఆలోచనలనుంచి పుట్టుకొచ్చిందే శ్రీశాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల. 2006లో పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో ముగ్గురు పిల్లలతో ఓ పాత వీడియో థియేటర్‌లో ప్రారంభమైన ఈ పాఠశాల నేడు పులిమేరు కేంద్రంగా, అన్నవరం బ్రాంచితో కలిపి సుమారు 150 మందికి పైగా పిల్లలకు ఆశ్రయం ఇచ్చే స్థాయికి ఎదిగింది. పాఠశాల ప్రారంభించిన మొదట్లో తమ, చేరదీసిన దివ్యాంగ బిడ్డలకు కడుపునిండా తిండి పెట్టేందుకు ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువునూ తాకట్టు పెట్టేశారు.
ఒకానొక సమయంలో చివరకు తాళిబొట్టును కూడా తాకట్టు పెట్టి సొమ్ము తెచ్చి చిన్నారుల ఆకలిని తీర్చారు అమ్మకు ప్రతిరూపంగా నిలిచిన సత్య. ఇక్కడ ఉంటున్న వారిలో చాలామంది వివిధ రకాలుగా బాధపడుతూ అనాథలుగా మిగిలిన వారే. వారిలో కొందరికి వినిపించదు, మరికొందరికి రెండు కళ్లూ కనిపించవు, మరికొందరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. చాలామంది రాత్రిళ్లు అసలు నిద్రే పోరు. వారందరికీ ఇప్పటికీ ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారా దంపతులు.
ప్రముఖుల సందర్శన : ఈ పాఠశాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సోదరి షర్మిలారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి పలువురు ప్రముఖులు గతంలో సందర్శించారు. పలు సందర్భాల్లో జిల్లాకు వచ్చిన వారు పాఠశాలను సందర్శించి చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అంగవైకల్యం తెలియనివ్వడం లేదు
మాది పిఠాపురం మండలం మంగుతుర్తి 13 ఏళ్ల కిందట గ్రామంలో అందరూ కుంటోడు కుంటోడు అంటే ఏడుపు వచ్చేది. అప్పుడే పులిమేరులో పాఠశాల ఉందంటే మా అమ్మనాన్నలు ఇక్కడ చేర్పించారు. ఇక్కడ చేరిన తరువాత అంగవైకల్యం ఉందన్న ధ్యాస లేకుండా ఆనందంగా గడుపుతున్నాను.
–మారే సత్తిబాబు, వికలాంగ విద్యార్థి, మంగుతుర్తి, పిఠాపురం మండలం
ఇక్కడ ఆనందంగా గడుపుతున్నా..
దేవుడు నాకు కళ్లు ఇవ్వలేదు. నా తండ్రి చనిపోవడంతో కుటుంబ సభ్యులకు భారం అయ్యాను. అయిన వారికి కష్టమని ఈ స్కూల్‌లో జాయిన్ చేశారు సహచర విద్యార్థులతో ఆనందంగా గడుపుతున్నాను.
– ఆర్సి సాయిధనలక్ష్మి, అంధ విద్యార్ధి, యర్రవరం, ఏలేశ్వరం మండలం
ఇది దైవసేవగా భావిస్తాం
అంగవైకల్యంతో బాధపడేవారి గురించి ఎవరూ పట్టించుకోరు. అందుకనే వికలాంగులకు సేవ చేయాలనే సంకల్పంతో మేము ఈ పాఠశాలను స్థాపించాం. వీరి సేవలో ఎంతో ఆనందం లభిస్తోంది. వీరు మా పిల్లలతో సమానం. వికలాంగుల సేవచేయడం దైవసేవగా భావిస్తున్నాం.
– వీరబాబు సత్య దంపతులు, పాఠశాల నిర్వాహకులు, పులిమేరు
దాతల సహకారంతో..
ఈ పాఠశాల దాతల సహకారంతో కొనసాగుతోంది. 2006లో ముగ్గురితో ప్రారంభమైన ఈ పాఠశాల ఇప్పటికి 120 మంది విద్యార్థులతో నడుస్తోంది. నిర్వాహకులు ఇచ్చిన శ్రీచేయిచేయి కలుపుదాం.. చేయూతనిద్దాంశ్రీ అనే నినాదంతో జిల్లా నలుమూలల నుంచి దాతలు, పలు స్వచ్ఛంద సంఘాలు ఆర్థిక సహకారం చేస్తుండడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతివర్ధన సంస్థ ముందుకు సాగుతోంది. అన్నవరంలో శాంతి వర్ధన పాఠశాల అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. పలువురు పుట్టినరోజు, వివాహ వేడుకలను ఈ పాఠశాలల్లో జరుపుకుని విద్యార్థులకు అవసరమైన వస్త్రాలు, దుప్పట్లు, సంస్థకు అవసరమైన పలు పరికరాలను అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment