పెట్టుబడి పిడుగు
● అన్నదాతలను దెబ్బతీసిన ఫెంగల్
● అదనపు ఖర్చులతో ఆవేదన
● ఉమ్మడి జిల్లాలో తుపాను బారిన
45 వేల ఎకరాలు
● యంత్రాల స్థానంలో కూలీల వినియోగం
సాక్షి, అమలాపురం: ఫెంగల్ తుపాను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రైతులకు కంటికి కనిపించే నష్టం కొంత చేస్తే, కనిపించని నష్టం అంతకు రెండు, మూడు రెట్లు చేసింది. తుపాను వల్ల వరిచేలు నేలకొరగడం, ఒరిగిన చేలు కొంత మేర నీట నానడం వల్ల ధాన్యం నాణ్యత దెబ్బతిననుంది. ఇదే సమయంలో యంత్రాలతో కోతలు నిలిచిపోవడం, ఆ స్థానంలో కూలీలతో కోతలు, నూర్పిడులు, తడిసిన ధాన్యం ఎండబెట్టడం వంటి పనులకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
చేదు ఫలితాలు
ఫెంగల్ తుపాను ప్రభావంతో రెండు రోజుల పాటు కురిసిన వర్షాలు ఉమ్మడి తూర్పు రైతులకు చేదు ఫలితాలు చూపాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా, 1.05 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి కోతలు జరిగాయి. ఇంకా 58 వేల ఎకరాల్లో కోతలు జరగాలి. కాకినాడ జిల్లాలో 2.14 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, 1.20 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ఇంకా 94 వేల ఎకరాల్లో మిగిలాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,78,447 లక్షల ఎకరాలలో సాగు జరగగా, 1,22,470 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. ఇంకా 55,976 ఎకరాల్లో కోతలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో ఫెంగల్ తుపాను ఉమ్మడి తూర్పు రైతులను చావు దెబ్బతీసింది.
నీటిలోనే వరికంకులు
భారీ వర్షాల వల్ల మూడు జిల్లాలో సుమారు 41 వేల ఎకరాల్లో 20 శాతం నుంచి 30 శాతం వరకు వరిచేలు నేలకు ఒరిగి నీట నానుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో మినహా డెల్టా శివారుల్లో నీరు దిగే పరిస్థితి లేక వరి కంకులు నీటిలోనే ఉన్నాయి. డెల్టాలో మురుగునీటి కాలు వ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ముంపునీరు దిగే పరిస్థితి లేదు. కాలువల్లో పూడిక తీత, గుర్రపుడెక్క తొలగింపునకు ఇచ్చిన నిధులతో పనులు చేపట్టిన దాఖలాలు లేవు. దీనివల్ల నీరు దిగక ధాన్యం దెబ్బతిని రంగు మారిపోతోందని రైతులు వాపోతున్నారు.
ఒబ్బిడి చేయడం అదనపు భారం
నెలకొరిగిన చేలల్లో పంటను ఒబ్బిడి చేయడం రైతులకు అదనపు భారం కానుంది. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో యంత్రంతో కోతకు, కూలీలతో ధాన్యం ఎండ బెట్టేందుకు కలిపి ఎకరాకు రూ.ఏడు వేల వరకు అయ్యేది. వర్షాలకు చేలు నేలనంటిన చోట మెషీన్‌తో కోతకు రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. అదనంగా మరో ముగ్గురు, నలుగురు కూలీలతో కలిపి రూ.పది వేల వరకు అవుతోంది. మనుషులతో కోతకు పదిహేను మంది వరకు మహిళా కూలీలకు, తడిసిన పనలను గట్టు మీదకు తెచ్చేందుకు, పడుగులు వేయడం, ఆరిన తరువాత ట్రాక్టర్‌తో నూర్పిడులకు, చిన్న ఫ్యాను ట్రాక్టరుతో ధాన్యం ఎగరబోత, ధాన్యం పట్టుబడికి కలిపి ఎకరాకు సుమారు రూ.14,400 వరకు అవుతోందని రైతులు లెక్క కడుతున్నారు. ఇప్పటి వరకు యంత్రాలతో కోతలు, ధాన్యం పట్టుబడులకు రెండు, మూడు రోజులు సరిపోతే, ఇదే పనికి ఇప్పుడు ఐదా రు రోజుల సమయం పడుతోందని చెబుతున్నారు.
కోతల ఖర్చు ఎక్కువైంది
తుపాను వర్షాల వల్ల వరి చేలల్లో నీరు చేరి కోతలు ఆగిపోయాయి. తుపాను ముందు యంత్రాల సహాయంతో వరి కోతలు సాఫీగా సాగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చేలల్లో నీరు ఉండడం వల్ల యంత్రాలు నడవటానికి ఇబ్బందిగా ఉంది. పోనీ కూలీలతో వరి మాసూళ్లు చేద్దామంటే రైతులు అదనపు ఖర్చులు భరించవలసి వస్తోంది. ఖరీఫ్‌లో ఏటా రైతులు నష్టపోతూనే ఉన్నారు. వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో ఖరీఫ్ పంట చేతికందని పరిస్థితి నెలకొంది.
– బొక్కా శ్రీనివాస్, రైతు,
అల్లవరం
దళారుల హవా
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ధాన్యం కొనుగోలు దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. బస్తా (75 కేజీలు) ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,725 కాగా, దీని కన్నా రూ.100 నుంచి రూ.150 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రంగుమారి, మొలక వచ్చిన ధాన్యాన్ని కొంటారనే నమ్మకం రైతులకు కలగడం లేదు. ఈ ఏడాది డెల్టా శివారు ప్రాంతాల్లో దిగుబడి సగటు 29 బస్తాలు (21.75 క్వింటాళ్లు) కన్నా తక్కువగా వస్తోందని రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment