కట్న కానుకలకు మంగళం!
● సత్యదేవుని నిత్య కల్యాణంలో ఆగిపోయిన ఆచారం
● గతంలో ప్రతి నెలా రూ.లక్షకు పైగా ఆదాయం
అన్నవరం: సత్యదేవుని నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామి, అమ్మవారికి కట్న కానుకలు సమర్పించే సంప్రదాయానికి పురోహితులు, అర్చకులు, సిబ్బంది మంగళం పలికారు. రత్నగిరిపై ప్రతీరోజు స్వామి, అమ్మవారికి కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కల్యాణంలో పాల్గొనే భక్తులు స్వామి, అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించడం, కల్యాణం అనంతరం స్వామి, అమ్మవారికి కట్న కానుకలు సమర్పించే ఆచారం పూర్వం నుంచీ ఉంది. కొన్నేళ్లుగా ఈ ఆచారం పాటించకపోవడంతో 2023 సంవత్సరంలో అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ ఆగస్టు 13వ తేదీ నుంచి భక్తులు కట్నకానుకలు సమర్పించే విధానాన్ని పునరుద్ధరించారు. దీంతో కల్యాణం చేయించే భక్తులునుద్దేశించి అర్చకస్వాములు, పురోహితులు స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించవచ్చునని, కట్నకానుకలు చదివించాలని ప్రకటించడంతో ప్రతి రోజూ భక్తులు కట్నకానుకలు చదివించేవారు. నూతన పట్టు వస్త్రాలు దేవస్థానం వద్ద కొని వాటిని స్వామి, అమ్మవార్లకు సమర్పించేవారు. గతేడాది ఆగస్టు నుంచి ప్రతి నెలా సుమారు రూ.లక్ష కట్నకానుకల రూపంలో, రోజూ పదుల సంఖ్యలో నూతన వస్త్రాలు స్వామికి వచ్చాయి. రూ.500, అంతకన్నా ఎక్కువ మొత్తాలను రికార్డులో రాసి వారి గోత్రనామాలను పండితులు చదివి ఆశీర్వదించేవారు. అంతకు తక్కువ అయితే ఆ మొత్తాన్ని హుండీలో వేసేవారు. ఈ విధంగా 2023 సంవత్సరంలో దేవస్థానానికి సుమారు రూ.ఐదు లక్షల ఆదాయం సమకూరింది. ఆ తరువాత కట్న కానుకల చదివింపు కార్యక్రమాన్ని నిలుపుదల చేసి కేవలం పట్టు వస్త్రాల సమర్పణ మాత్రమే కొనసాగిస్తున్నారు. దీనిపై నిత్యకల్యాణం సిబ్బందిని ప్రశ్నిస్తే కట్న కానుకలు ఆపేశామని తెలిపారు. అధికారులు ఈ కట్న కానుకల చదివింపును పునరుద్ధరిస్తే దేవస్థానానికి ఆదాయంతో బాటు భక్తులు సంతృప్తి చెందుతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment