ప్రజల మనిషి సుందరయ్య
సీపీఎం జిల్లా మహాసభల
ప్రారంభోత్సవ సభలో వక్తలు
పెద్దాపురం: కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య ప్రజల మనిషి అని పలువురు వక్తలు కొనియాడారు. సీపీఎం జిల్లా మహాసభల సందర్భంగా స్థానిక వరహాలయ్యపేటలోని యాసలపు సూర్యారావు భవనంలో శుక్రవారం సుందరయ్య జీవిత విశేషాలతో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. దీనిని సీపీఎం సీనియర్ నాయకుడు టీఎస్ ప్రకాష్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన, సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు బేబీరాణి మాట్లాడుతూ, నిత్యం ప్రజల కోసమే ఆలోచించిన వ్యక్తి సుందరయ్య అని అన్నారు. ఉద్యమమే ఊపిరిగా నిస్వార్థ నాయకుడిగా ఎదిగిన ఆయన ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లి, కమ్యూనిస్టు గాంధీగా పేరొందారని, కమ్యూనిస్టులు ఎంత నిస్వార్థంగా పని చేస్తారో చెప్పడానికి సుందరయ్య జీవితమే ఉదాహరణని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు, నాయకులు నీలపాల సూరిబాబు, గడిగట్ల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
23న జాబ్‌మేళా
కాకినాడ సిటీ: తమ కార్యాలయం ఆధ్వర్యాన ఈ నెల 23న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు శుక్రవారం తెలిపారు. టీమ్ లీజ్‌లో బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మహీంద్ర ట్రాక్టర్స్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్, మెకానిక్ హెల్పర్లు, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఒడిగోస్ కంపెనీలో అడ్మిషన్ల కో ఆర్డినేటర్, ఇండో ఎంఐఎం, హోండాయ్ మోబీస్, కేఐఎంఎల్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12,800 నుంచి రూ.18 వేల వరకూ జీతం, ఆయా ఉద్యోగాలను బట్టి ఇన్సెంటివ్‌లు, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు సోమవారం ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయానికి హాజరు కావాలని కోరారు. ఆసక్తి ఉన్న వారికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) ద్వారా శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పిస్తామని లచ్చారావు తెలిపారు.
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
కాకినాడ క్రైం: జిల్లా పరిధిలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ శనివారం నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల చోటు చేసుకుంటున్న అధిక మరణాలకు హెల్మెట్ ధరించకపోవడమే కారణమని, ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలతో తాజా ఆదేశాలు జారీ చేశామని వివరించారు. హెల్మెట్ ధరించకుండా నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తామని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment