అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని జన్మనక్షత్ర పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సత్యదేవుని జన్మనక్షత్రం మఖను పురస్కరించుకుని, స్వామివారికి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం నిర్వహించారు. తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారి ఆలయం తెరచి, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్‌లకు, శివలింగానికి పండితులు పంచామృతాలతో మహన్యాసపూర్వక అభి షేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను స్వర్ణాభరణాలతో అలంకరించి, సుగంధభరిత పుష్పాలతో పూజించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దేవస్థానం ఈఓ వి.సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామివారిని దర్శించారు. స్వామివారి యాగశాలలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ఆయుష్య హోమం నిర్వహించారు.
సత్యదేవుని దర్శించిన 25 వేల మంది
సత్యదేవుని సుమారు 25 వేల మంది భక్తులు దర్శించారు. స్వామివారిని దర్శనానంతరం, భక్తులు గోశాలలో సప్తగోవులను దర్శించి, పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు వెయ్యి జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో 4 వేల మందికి భోజనం పెట్టారు.
వనదుర్గ అమ్మవారికి చండీహోమం
రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి పండితులు చండీహోమం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు హోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గమ్మకు కుంకుమ పూజలు కూడా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment