చూసిన కనులదే భాగ్యం
ఆత్రేయపురం: కల్యాణం వైభోగం అన్నట్లు గోదాదేవి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.. చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగాయి.. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం గోదాదేవి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, కల్యాణం, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు భోగిమంట వేశారు. అనంతరం భక్తజన సందోహం నడుమ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. వాడపల్లి క్షేత్రంలోని విశాలమైన స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. స్వామివారికి డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తదితర ప్రముఖులు కల్యాణ పట్టువస్త్రాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, కల్యాణాన్ని తిలకించి, మొక్కుబడులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సతీసమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
అప్పనపల్లిలో..
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి క్షేత్రంలో కొలువు దీరిన శ్రీగోదా రంగనాథుల తిరు కల్యాణ మహోత్సవం సోమవారం రమణీయంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర పరిమళ సుగంధ ద్రవ్యాల నడుమ అర్చక స్వాములు గోదా రంగనాథుల కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు. 200 మందికి పైగా భక్త దంపతులు కల్యాణంలో కర్తలుగా పాల్గొన్నారు. పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా రూపొందించిన మంటపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. స్వామి, అమ్మవార్ల గుణగణాలను వివరిస్తూ అర్చక స్వాములు రాయభార ఉత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు దంపతులు కర్తలుగా పాల్గొని కల్యాణ క్రతువును జరిపించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తన్మయత్వం చెందారు.
Comments
Please login to add a commentAdd a comment