ప్రభలసీమ | - | Sakshi
Sakshi News home page

ప్రభలసీమ

Published Thu, Jan 16 2025 8:04 AM | Last Updated on Thu, Jan 16 2025 8:03 AM

ప్రభల

ప్రభలసీమ

సాక్షి, అమలాపురం/అంబాజీపేట/కొత్తపేట: అందమైన పూదోటల్లో.. మరింత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలు విహరించినట్టుగా పైరు పచ్చని కోనసీమలో రంగురంగుల ప్రభలు విహరించాయి. పచ్చని వరిచేలు.. కొబ్బరితోటల మధ్య నుంచి... గలగల పారే పంట, మురుగునీటి కాలువలను దాటుకుంటూ సందడి చేశాయి. రంగురంగుల కంకర్లు.. అందమైన అల్లికలు.. జే గంటలు.. పసిడి కంకులతో తయారు చేసిన ధాన్యం కుచ్చులు.. భారీ గజమాలలు.. గుమ్మడికాయలు.. నెత్తిన నెమలిపింఛాలతో ముగ్ధమనోహరమైన ప్రభలను చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. కోనసీమలో జగ్గన్నతోటతో పాటు పలుచోట్ల మంగళ, బుధవారాల్లో జరిగిన తీర్థాలకు జనం పోటెత్తారు.

వ్యాఘ్రేశ్వరస్వామి అధ్యక్షతన..

నింగిలోని ఇంద్రధనస్సు నేలకొచ్చివాలిందా అన్నట్టు జగ్గన్నతోటలో పరమేశ్వరుని పదకొండు రూపాలు భక్తుల కళ్లముందు దర్శనమిచ్చాయి. మొసలపల్లి భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సమావేశానికి అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభ వచ్చిన సమయంలో మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకి ఎత్తి దించారు. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. జిల్లా నలమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానికులే కాకుండా వివిధ రాష్ట్రాలు, దేశాలకు ఉపాధి కోసం వెళ్లినవారు తీర్థానికి కుటుంబ సమేతంగా వచ్చారు. తీర్థానికి సుమారు లక్ష మంది హాజరైనట్టు అంచనా. ఒక వైపు ప్రభల మోసే భక్తుల ఓంకార నాదాలు.. ప్రభలకు వేలాడదీసిన జేగంటల శబ్దాలు.. ప్రభల మోసేవారి అశ్శరభ.. శరభ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. తీర్థం జరిగిన జగ్గన్నతోటకు రెండు కిలోమీటర్ల మేర భక్తజన సవ్వడి వినిపించింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. 2.30 గంటల సమయంలో గంగలకుర్రు, ఆ తరువాత గంగలకుర్రు అగ్రహారం ప్రభలు మురుగునీటి కాలువ (కౌశిక) దాటుతున్న సమయంలో వేలాదిగా జనం మురుగునీటి కాలువ, వంతెనల మీదకు చేరుకున్నారు. ప్రభలు కౌశిక దాటే సన్నివేశాన్ని ఆసక్తిగా తిలకించారు. తీర్థాలకు సంప్రదాయ వస్త్రధారణలతో యువతులు ప్రభల అందాలతో పోటీ పడ్డారు. వృద్ధులు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా తీర్థానికి వచ్చారు. కొన్ని కుటుంబాల వారు గూడు ఎడ్లబండ్లపై తీర్థానికి రావడం పలువురిని ఆకట్టుకుంది. ఇదే మండలంలో వాకలగరువు సరిహద్దులో జరిగిన ప్రభల తీర్థంలో వాకలగరువు 53 అడుగులు, తొండవరం 55 అడుగుల ఎత్తున ప్రభలు భక్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వీటి వద్ద ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.

కొత్తపేటలో బాణసంచా కాల్పులు

కొత్తపేటలో సంక్రాంతి రోజు మంగళవారం తెల్లవారు జాము నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 24 గంటల పాటు జరిగిన ఈ తీర్థానికి సైతం పెద్ద ఎత్తున జనం వచ్చారు. పాత, కొత్త రామాలయం వీధుల వారు ఒకరి తరువాత ఒకరు ప్రభలను ఊరేగించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ కాలేజ్‌ గ్రౌండ్‌లో, అనంతరం ప్రభల తిరుగు ఊరేగింపులో భాగంగా అర్థరాత్రి 2 గంటల నుంచి బుధవారం ఉదయం 5.30 గంటల వరకూ పాత బస్టాండ్‌ సెంటర్‌లో బాణసంచా కాల్పుల మోత హోరెత్తింది. ఇదే మండలంలో మందపల్లి, అవిడి డ్యామ్‌సెంటరు, వాడపాలెం, రావులపాలెం మండలం దేవరపల్లిలో కూడా ప్రభల తీర్థాలు జరిగాయి.

కొర్లగుంటకు 12 ప్రభలు

మామిడికుదురు మండలం కొర్లగుంటలో జరిగిన తీర్థంలో 12 ప్రభలు కొలువుదీరాయి. ప్రభలు పంటచేలు, కాలువలు దాటుకుని వచ్చాయి. కొత్తపేట మండలం అవిడి, పి.గన్నవరం మండలం మానేపల్లి, నాగుల్లంక, పప్పులవారిపాలెం, అయినవిల్లి, అమలాపురం మండలం సాకుర్రు గరువు, బండారులంక, అమలాపురంలో గనికమ్మగుడి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, రాజోలు పొదలాడ, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, క్రాప చింతలపూడి, కాట్రేనికోన మండలం చెయ్యేరు, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవిల్లో ప్రభలు తీర్థాలు సాగాయి.

జిల్లాలో పలుచోట్ల ప్రభల తీర్థాలు

దారులన్నీ జగ్గన్నతోట వైపే

పోటెత్తిన భక్తజనం

లోకకల్యాణార్థం

కొలువుతీరిన ఏకాదశ రుద్రులు

కొత్తపేట, కొర్లగుంటల్లో

సైతం జనం బారులు

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభలసీమ1
1/2

ప్రభలసీమ

ప్రభలసీమ2
2/2

ప్రభలసీమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement