వైభవంగా సత్యదేవుని ప్రభోత్సవం
అన్నవరం: కనుమ పండగ సందర్భంగా బుధవారం రాత్రి సత్యదేవుని ప్రభోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సత్యదేవుడు, అమ్మవారు, క్షేత్ర పాలకులు సీతారాముల ఉత్సవమూర్తులను రత్నగిరి నుంచి పల్లకీలపై ఊరేగింపుగా స్థానిక చినరావిచెట్టు సమీపంలోని పురగిరి క్షత్రియ కులస్తుల రామకోవెల వద్దకు తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లకు రామకోవెల ధర్మకర్త సోము జోగురాయుడు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. రామకోవెలలో రెండు ప్రత్యేక ఆసనాలపై సత్యదేవుడు, అమ్మవారిని, సీతారాములను వేంచేయించి, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీస్సులు అందజేశారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రభపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకూ గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. జోగురాయుడు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వేద పండితులు, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు సుధీర్, పరిచారకులు ముత్య వేంకట్రావు, కల్యాణ బ్రహ్మ చామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాదస్వర సంగీతం, తప్పెటగుళ్లు, కోలాటం భక్తులను అలరించాయి.
ముగిసిన ధనుర్మాసోత్సవాలు
గత నెల 16వ తేదీ నుంచి అన్నవరంలో నిర్వహిస్తున్న సత్యదేవుని ధనుర్మాసోత్సవాలు కనుమ పండగ నాడు నిర్వహించిన ప్రభోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల రోజులూ సత్యదేవుడు, అమ్మవారిని గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఘనంగా ఊరేగించారు. తమ ఇళ్ల ముంగిటకు వచ్చిన స్వామి, అమ్మవారికి గ్రామస్తులు ఘనంగా నివేదనలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment