రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రహదారులపై ప్రయాణం చేసే క్రమంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ మేరకు అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రవాణా, ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే సూచించారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకూ జరిగే భద్రతా వారోత్సవాల ప్రారంభం సందర్భంగా గురువారం ఆయన కాకినాడ వచ్చారు. స్థానిక ఆర్‌టీఓ కార్యాలయంలో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంతిలాల్ దండే మాట్లాడుతూ, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనాలు నడిపే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియమావళి, జాతీయ రహదారులపై వాహనాలు నడిపే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆటో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ చేపట్టాలన్నారు. రవాణా, పోలీస్, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు తదితర శాఖల అధికారుల సమన్వయంతో పని చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. హెల్మెట్ ధారణపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా రహదారుల భద్రతపై యువతకు, ఆటో డ్రైవర్లకు, మహిళలకు విస్తృత స్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ కె.శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రారంభించిన గుడ్ సమారిటన్ అంశంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని, ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. వాహన చోదకులకు, యువతకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమావళిపై ప్రత్యేక శిక్షణ చేపట్టేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. ఆటో డ్రైవర్లు, భారీ వాహనాలు నడిపే వారికి కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment