గ్యాస్ వాటా కోసం అందరం ఉద్యమిద్దాం
కాకినాడ సిటీ: మన గ్యాస్ మన రాష్ట్రానికే దక్కాలనే డిమాండుతో వచ్చే నెల 1న కాకినాడలో సదస్సు నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ పీఆర్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పుల్లో ఉన్న మన రాష్ట్రం అభివృద్ధికి.. కాకినాడ సముద్ర తీరంలో లభిస్తున్న చమురు, గ్యాస్ నిక్షేపాల్లో వాటా కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరాన గత ఏడాది జనవరి 7న సముద్ర గర్భం నుంచి ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. కృష్ణా – గోదావరి బేసిన్‌లో గ్యాస్‌తో పాటు చమురు ఉత్పత్తుల విలువ లక్షల కోట్ల రూపాయలకు మించి ఉంటుందన్నారు. ఈ నిక్షేపాలు దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చబోతున్నాయని, రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధికి ఇది చాలా కీలకమైనదని చెప్పారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా స్థానికంగా లభ్యమయ్యే సహజ వనరులను ఉపయోగించుకునే హక్కు ఆ ప్రాంతానికే ఉంటుందనేది సహజ న్యాయ సూత్రమన్నారు. సహజ వనరుల ఉత్పత్తిలో ఆ రాష్ట్రానికి 50 శాతం కేటాయించాలని 12వ ఆర్థిక సంఘం కూడా చెప్పిందని అన్నారు. మన తీరం నుంచి 1,500 కిలోమీటర్ల దూరాన ఉన్న గుజరాత్, మహారాష్ట్రలకు గ్యాస్ అక్రమంగా తరలిస్తూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మధు విమర్శించారు. మన చమురు, గ్యాస్ నిక్షేపాల్లో అత్యధిక వాటా మనకే దక్కాలంటూ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా తీర్మానించినా కేటాయింపులు, ఆదాయంలో సగం పొందలేకపోతున్నామని మధు చెప్పారు. వచ్చే నెల 1న నిర్వహిస్తున్న సదస్సును ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.
21, 22 తేదీలలో
కోనసీమ క్రీడోత్సవాలు
అమలాపురం రూరల్: ఈ నెల 21, 22 తేదీలలో జిల్లా స్థాయిలో ‘కోనసీమ క్రీడోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు మండల స్థాయిలో గెలుపొందిన 7, 8, 9 తరగతుల సుమారు 2,700 మంది విద్యార్థులకు జీఎంసీ బాలయోగి స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment