ప్రభోత్సవం త్వరగా ముగించడంపై ఫిర్యాదు
అన్నవరం: కనుమ పండగ సందర్భంగా బుధవారం రాత్రి అన్నవరంలోని పురగిరి క్షత్రియుల రామకోవెలలో జరిగిన సత్యదేవుని ప్రభోత్సవాన్ని త్వరగా ముగించడంపై ధర్మకర్త సోము జోగురాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు గురువారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని భక్తుల సందర్శనార్థం రాత్రి 8 గంటల వరకూ ఉంచకుండా రాత్రి 7.15 గంటలకే ఊరేగింపుగా తీసుకుని వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏటా వస్తున్న ఆచారం ప్రకారం రామాలయం వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం లేదని పేర్కొన్నారు. ఏటా ఇలాగే జరుగుతోందని, కనీసం ఈసారైనా స్వామి, అమ్మవార్లను రామకోవెలలో ఎక్కువసేపు ఉంచాల్సిందిగా అధికారులను కోరామని తెలిపారు. దానికి అధికారులు అంగీకరించినప్పటికీ ఎప్పటిలానే రాత్రి 7.15 గంటలకే స్వామి, అమ్మవార్లను తీసుకుని వెళ్లారని, ఆ తరువాత స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశ చెందారని తెలిపారు. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జోగురాయుడు కోరారు.
వచ్చే నెలలో సివిల్
సర్వీసెస్ హాకీ పోటీలు
కాకినాడ సిటీ: వచ్చే నెల 15 నుంచి 28వ తేదీ వరకూ కాకినాడలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ జరగనుందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ నిర్వహించాలంటూ ఆయన గతంలో ప్రతిపాదించారు. దీనికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ బోర్డు అంగీకరించింది. ఈ నేపథ్యంలో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్, ట్రస్ట్ ఫౌండర్, ఆదాయ పన్ను అధికారి రవిచంద్ర, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బి.శ్రీనివాస్ కుమార్‌తో కలిసి కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షణ్మోహన్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కాకినాడలో జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ పోటీలను కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్, జిల్లా అసోసియేషన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన పక్కాగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో కాకినాడలో అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించేందుకు కూడా కృషి చేస్తామని అన్నారు.
వేటకు వేళాయె..
పిఠాపురం: సంక్రాంతి సంబరాలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతూ ఇప్పటి వరకూ ఇళ్లకు పరిమితమైన వారు తిరిగి ఎవరి పనుల్లో వారు క్రమంగా తలమునకలవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12 నుంచి వేటకు విరామం ప్రకటించి, సంబరాల్లో మునిగి తేలిన మత్స్యకారులు కూడా ఐదు రోజుల అనంతరం తిరిగి తమ జీవన పోరాటం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఒడ్డున ఉన్న బోట్లను, తెప్పలను సముద్రంలోకి చేర్చుకుంటున్నారు. వలలు, ఇతర వేట సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే సుదూర ప్రాంతాల్లో చేపల వేటకు కొంత మంది మత్స్యకారులు సముద్రం పైకి వెళ్లగా.. మిగిలిన వారు కూడా వేటకు ఉపక్రమిస్తున్నారు. ఐదు రోజులుగా బోసిపోయిన సముద్ర తీరం శుక్రవారం నుంచి చేపల క్రయవిక్రయాలతో కళకళలాడనుంది.
భీమేశ్వరాలయ నిత్య అన్నదాన
పథకానికి రూ.లక్ష విరాళం
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన దాత పుప్పాల అజయ్‌కుమార్ గురువారం రూ. 1,00,116లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు చెక్‌ను ఆలయ సీనియర్ సహాయకుడు సూరపుపురెడ్డి వెంకటేశ్వరరావు(వెంకన్నబాబు) చేతికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment