రత్నగిరిపై భక్తజనవాహిని
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● 2 వేల వ్రతాల నిర్వహణ
● దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి గురువారం కిక్కిరిసింది. సంక్రాంతి పండగలకు స్వస్థలాలకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో భాగంగా మార్గం మధ్యలో సత్యదేవుని దర్శించుకుంటున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ పెరిగింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించారు. సుమారు 2 వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
నిజరూప దర్శనం
ప్రతి రోజూ సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు స్వర్ణాభరణాలు, వజ్ర కిరీటాలు, పట్టు వస్త్రాలతో దర్శనమిస్తారు. ప్రతి గురువారం మాత్రం ఎటువంటి అలంకరణా లేకుండా నిజరూపాలతో దర్శనమిస్తారు. ఆవిధంగా సత్యదేవుని నిజరూప దర్శనం చేసుకున్న భక్తులు పులకించారు.
నేడు జన్మ నక్షత్ర పూజలు
సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్‌లకు పంచామృతాభిషేకాలు, ఉదయం 11 గంటలకు ఆయుష్య హోమం నిర్వహిస్తారు. వనదుర్గ అమ్మవారికి ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ చండీ హోమం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment