బాలారిష్టాలు
● సత్యదేవుని సన్నిధిలో డిజిటల్
చెల్లింపుల్లో ఇబ్బందులు
● నత్తలా ఇంటర్‌నెట్ వేగం
● టిక్కెట్ల జారీకి ఎక్కువ సమయం
● తప్పనిసరి అవుతున్న నగదు లావాదేవీలు
అన్నవరం: సత్యదేవుని భక్తుల సౌకర్యార్థం రత్నగిరిపై ప్రారంభించిన డిజిటల్ చెల్లింపుల విధానానికి బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. పశ్చిమ రాజగోపురం వద్ద డిజిటల్ పేమెంట్స్ కౌంటర్‌ను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు ఈ నెల 2న ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే, క్రెడిట్, డెబిట్ కార్డులతో భక్తులు సత్యదేవుని వ్రతం, దర్శనం, నిత్య కల్యాణం, లక్ష్మీప్రయుక్త ఆయుష్య హోమం, ప్రత్యంగిర హోమం (అడ్వాన్స్), ఇతర సేవల టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. రోజూ తెల్లవారుజామున 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఈ కౌంటర్ ద్వారా డిజిటల్ పేమెంట్ల సౌకర్యం అందుబాటులో ఉంటోంది. పీఆర్‌ఓ కార్యాలయంలోని కౌంటర్ ద్వారా ఈ నెల 1 నుంచి ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ డిజిటల్ చెల్లింపుల ద్వారా టిక్కెట్లు జారీ చేస్తున్నారు.
కానరాని ప్రచారం
దేవస్థానంలో డిజిటల్ పేమెంట్ల సౌకర్యం ఉన్నట్లు భక్తులకు తెలిసేలా రత్నగిరి పైన కానీ, కొండ దిగువన కానీ ఎక్కడా ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే, మైకు ద్వారా కూడా ప్రచారం చేయడం లేదు. దీంతో చాలా మంది భక్తులకు డిజిటల్ చెల్లింపుల విధానం ఉన్న విషయం తెలియడం లేదు. పశ్చిమ రాజగోపురం వద్ద నగదు లావాదేవీల కౌంటర్, డిజిటల్ పేమెంట్ కౌంటర్ ఎదురెదురుగా ఉన్నాయి. అక్కడకు వచ్చాక మాత్రమే డిజిటల్ చెల్లింపులకు అవకాశం ఉందనే విషయం తెలిసిన కొంత మంది భక్తులు మాత్రమే అప్పటికప్పుడు దీనిని ఉపయోగించుకుంటున్నారు.
ఇంటర్‌నెట్‌తో సహనానికి పరీక్ష
డిజిటల్ పేమెంట్ల విషయంలో మరో ఇబ్బంది కూడా ఎదురవుతోంది. రత్నగిరిపై ఇంటర్‌నెట్ వేగం నత్తతో పోటీ పడుతోంది. ఫలితంగా ఒక్కో టిక్కెట్టు జారీకి 5 నిమిషాల సమయం పడుతోంది. దీంతో భక్తులు అసహనానికి గురవుతున్నారు. ఎక్కువ సేపు వేచి ఉండలేక, గత్యంతరం లేక నగదు ద్వారానే టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు.
10 శాతమే..
డిజిటల్ పేమెంట్ల ద్వారా వస్తున్న రాబడి దేవస్థానం ఆదాయంలో 10 శాతం మాత్రమే ఉంటోంది. ఈ నెల ఒకటి తేదీ నుంచి పదో తేదీ వరకూ దేవస్థానానికి నగదు కౌంటర్ల ద్వారా సుమారు రూ.3 కోట్ల ఆదాయం రాగా డిజిటల్ పేమెంట్ల ద్వారా సుమారు రూ.30 లక్షలు మాత్రమే వచ్చింది. డిజిటల్ పేమెంట్లపై దేవస్థానం విస్తృత ప్రచారం చేస్తే ఈ ఆదాయం ఇంకా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఇంటర్‌నెట్ వేగం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే, పశ్చిమ రాజగోపురం ముందున్న కౌంటర్ భక్తులకు పెద్దగా కనిపించడం లేదు. దీనిని ముందు వైపునకు మార్చాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment