ఘనంగా గోపూజోత్సవం
అన్నవరం: కనుమ పండగ సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన బుధవారం గోపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను పల్లకిలో ఉంచి ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అష్టోత్తర పూజ, శ్రీకృష్ణునికి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం గోవుకు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు పూజలు చేశారు. గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి, బియ్యం, బెల్లం తినిపించారు. అనంతరం గోవులకు హారతి ఇచ్చారు. తరువాత సత్యదేవుడు, అమ్మవార్లకు పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గోపూజ తదితర కార్యక్రమాలను దేవస్థానం వేద పండితులు గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ ఘనపాఠి, శివ ఘనపాఠి, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు కంచిభట్ల సాయిరామ్, ముత్య వేంకట్రావు, వైదిక కమిటీ సభ్యుడు, వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు నిర్వహించారు. రత్నగిరిపై సప్తగోకులంలోని గోవులకు కూడా అర్చకుడు కంచిభట్ల వరదయ్య ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో స్వామి, అమ్మవార్లతో పాటు సప్తగోకులంలో గోవులను కూడా దర్శించి, పూజలు చేశారు. ఏర్పాట్లను ఏఈఓ కె.కొండలరావు, పీఆర్‌ఓ డీవీఎస్ కృష్ణారావు తదితరులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment