నేతలకు మేత
● నీకింత.. నాకింత..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పండగల వేళ బరి వేసుకో.. కోడిపందేలాడుకో.. గుండాట, జూద క్రీడలు మీ ఇష్టం.. మేం ఉన్నాంగా.. మిమ్మల్ని అడ్డుకునే వారే లేరు.. వచ్చినదాంట్లో నువ్వు ఇంత తీసుకో.. నాకు ఇంత ఇవ్వు.. ఇవీ సంక్రాంతి కోడిపందేల నిర్వాహకులతో కూటమి నేతలు చేసుకున్న ఒప్పందాలు. ఈ మేరకు పండగ ముగిసిన తర్వాత పంపకాలు మొదలవడంతో కూటమి నేతల ముంగిట్లో మామూళ్ల రూపంలో కాసుల వర్షం కురుస్తోంది. వారి స్థాయిని బట్టి రూ.లక్షలు, రూ.కోట్లలో నజరానాలు ముట్టాయనే మాట టీడీపీ శ్రేణుల నుంచే బాహాటంగా వినిపిస్తోంది.
తునిలో ఓ ముఖ్య నేతకు రూ.1.20 కోట్లు!
జిల్లాలోనే అత్యధికంగా తుని నియోజకవర్గంలో కూటమి నేతలకు భారీగా ముట్టిందని చెబుతున్నారు. పండగల సందర్భంగా ఈ నియోజకవర్గంలోని 60 బరుల్లో మూడు రోజుల పాటు 2,100 పందేలు జరిగాయి. నియోజకవర్గంలోని మూడు మండలాలు, తుని పట్టణంతో కలిపి రూ.15 కోట్ల వరకూ పందేలు సాగాయి. ఇందులో ఓ ముఖ్య నేతకు రూ.1.20 కోట్లు అందినట్లు సమాచారం. మండల స్థాయి నాయకులకు రూ.10 లక్షల చొప్పున మూడు మండలాలకు రూ.30 లక్షలు, గ్రామ స్థాయి నాయకులకు రూ.2 లక్షల చొప్పున పంపకాలు చేశారు. ఎస్.అన్నవరం, తేటగుంట, వెలమపేట, అల్లిపూడి, బెండపూడి, పెరుమాళ్లపురం గ్రామాల్లో పందేలు జోరుగా జరిగాయి.
పిఠాపురంలో రూ.కోట్లలో..
పిఠాపురం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గొల్లప్రోలు నగర పంచాయతీ, పి.దొంతమూరు, చిత్రాడ, తాటిపర్తి, దుర్గాడ, వాకతిప్ప, నాగులాపల్లి, రమణక్కపేట, ఇసుకపల్లి తదితర గ్రామాల్లో 56 బరులు ఏర్పాటు చేశారు. మొత్తం 1,380 పందేలు రూ.9 కోట్ల మేర జరిగినట్లు సమాచారం. కొందరు నేతలకు రూ.కోటి వరకూ, మండల స్థాయి నాయకులకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చారు. గ్రామ స్థాయి నాయకుడికి రూ.లక్ష చొప్పున మొత్తంగా రూ.కోటి వరకూ ముట్టజెప్పారు. ఇవి కాకుండా గ్రామాల్లోని చిన్నాచితకా నాయకులు రూ.1.50 కోట్ల వరకూ పంచుకున్నట్లు చెబుతున్నారు.
కాకినాడ రూరల్‌లో..
నియోజకవర్గంలో రూ.13 కోట్ల మేర పందేలు జరిగాయి. ఓ నేతకు రూ.25 లక్షల వరకూ ముట్టజెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమిలోని రెండు ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు పందేల్లో కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. కాకినాడ, కరప మండలాల్లో పందేలు ఎక్కువగా జరిగాయి. కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ గైగోలుపాడులో కూడా పందేలు నిర్వహించారు. తిమ్మాపురం, సర్పవరం, కరప, గురజనాపల్లి తదితర గ్రామాల్లో కూటమి నేతలు దగ్గరుండి మరీ పందేలు ఆడించారు.
ఆ 3 నియోజకవర్గాల్లోనూ మామూళ్లే..
● జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో కూటమి ముఖ్య నేతలు కాకుండా కొందరు కార్యకర్తలు కూడా మామూళ్లు తీసుకున్నారు.
● జగ్గంపేట నియోజకవర్గంలో 45 బరుల్లో 1,600 పందేలు జరిగాయి. మూడు రోజులూ కలిపి మొత్తం రూ.9.05 కోట్ల మేర పందేలు జరిగాయి. బరుల వద్ద గుండాటల నిర్వహణకు నియోజకర్గంలోని ఒకరిద్దరు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ పాడుకున్నారు. జగ్గంపేట మండలం మర్రిపాకలో రోజుకు రూ.50 లక్షల మేర జూదం జరిగింది.
● పెద్దాపురం నియోజకవర్గంలోని 14 గ్రామాల్లో 42 బరుల్లో రూ.7 కోట్ల వరకూ పందేలు జరిగాయి. బరుల వద్ద కూటమి కార్యకర్తల హడావుడి కనిపించింది.
● ప్రత్తిపాడు నియోజకవర్గంలో 20 బరుల్లో జరిగిన పందేల ద్వారా రూ.కోటి వరకూ చేతులు మారాయి. కూటమికి చెందిన కొందరు రాజకీయ నాయకులే స్వయంగా పందేలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ఏలేశ్వరం, లింగంపర్తి, ప్రత్తిపాడు, రాచపల్లి, కత్తిపూడి, శంఖవరం, అన్నవరం, రౌతులపూడి, ములగపూడి తదితర చోట్ల పందేలు జోరుగా జరిగాయి.
కోడి పందేలతో పండగే పండగ
బరిలోనే పంపకాలు
కూటమి ముఖ్య నాయకులకు
రూ.50 లక్షలు
ద్వితీయ శ్రేణి మండల స్థాయి
వారికి రూ.2 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment