కోడ్ కత్తికి ‘సాన’ పట్టరా?
కాకినాడ రూరల్: అచ్చంపేట జంక్షన్ వద్ద కాకినాడ వచ్చే మార్గంలో టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ముఖద్వారం అధికారులకు పట్టడం లేదు. పట్టభద్రుల ఎన్నికల శంఖారావం మోగడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో పిఠాపురం నుంచి కాకినాడ వచ్చే మార్గంలో అచ్చంపేట జంక్షన్ వద్ద ఇటీవల ఎంపీ సానా సతీష్‌కు స్వాగతం పలుకూతు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. చిన్న చిన్న ఫ్లెక్సీలను తొలగించిన రెవెన్యూ అధికారులు దీనిని మాత్రం విడిచిపెట్టడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హాకీ టోర్నీకి ప్రత్యేక కమిటీలు
కాకినాడ సిటీ: స్థానిక జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అంశాల వారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకూ డీఎస్‌ఏ స్టేడియంలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ అధ్యక్షతన, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, సీపీవో, డీఎస్టీవోలు సభ్యులుగా ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీ, వివిధ ఉప కమిటీల సహకారంతో టోర్నమెంట్ నిర్వహణను పర్యవేక్షిస్తుందని తెలిపారు. అనంతరం టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు తెలిపిన స్పాన్సర్ సంస్థలు, తదితర అంశాలపై కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో జేసీ రాహుల్‌మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, డీఎస్డీవో బి.శ్రీనివాసకుమార్, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జె.కాంతు, డీఎంహెచ్‌ఓ నరసింహనాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భ్రూణ హత్యల నివారణపై దృష్టి
కాకినాడ సిటీ: ఆడ శిశువు పట్ల వివక్షతో జరిగే భ్రూణ హత్యలను నివారించడంతో పాటు డివిజన్ స్థాయిలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె.నరసింహనాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, లీగల్, సీ్త్ర శిశు సంక్షేమం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి డిస్ట్రిక్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ, డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ, జిల్లా స్థాయి పీసీ, పీఎన్‌డీటీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టామన్నారు. అల్ట్రా సౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్ట రీత్యా నేరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన 157 స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ నెల నుంచి జనవరి వరకు 38 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించగా 316 స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. డీఎల్‌ఏటివో డాక్టర్ రమేష్, డీఐవో డాక్టర్ కేవీ సుబ్బరాజు, వైద్యాధికారులు ఎస్.స్వప్న, పి.సరిత, పి.ఈశ్వరుడు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment