కామారెడ్డి టౌన్: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉద్యోగులు బోనాలతో ఊరేగింపు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మె శిబిరం నుంచి కొత్త బస్టాండ్ వద్ద ఉన్న మైసమ్మ ఆలయం వరకు ఊరేగింపు సాగింది. సమగ్ర శిక్ష ఉద్యోగులు బోనాలను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేలా అనుగ్రహించాలని అమ్మవారిని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కేజీబీవీలకు తాళాలు వేసి డీఈవోకు అప్పగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షులు వాసంతి, నాయకులు రాములు, సంతోష్ రెడ్డి, శైలజ, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment