అనువాదం బహుళ ప్రయోజనాన్ని కలిగి ఉండాలి
తెయూ(డిచ్‌పల్లి): అనువాదమనేది బహుళ ప్రయోజనాన్ని కలిగి ఉండాలని, సామాజిక మాధ్యమాలలో అనువాదం ముఖ్య పాత్రను పోషిస్తుందని, ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారాల ఆనంద్ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో తెలుగు విభాగం, సెంట్రల్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వెజెస్ (భారతీయ భాషా విభాగాల సంస్థ), రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు అధ్యాపకులకు పునశ్చరణ తరగతులు కొనసాగుతున్నాయి. మూడోరోజు శుక్రవారం కార్యక్రమంలో కీలక ఉపన్యాసకులుగా వారాల ఆనంద్ హాజరై, ’అనువాదం మెలకువలు’ అనే అంశంపై మాట్లాడారు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన రామాయణ కల్పవక్షాన్ని ఇతర భాషల్లోకి అనువాదం చేయగలిగితే తెలుగు భాషకు ఇంకా వైభవం తీసుకువచ్చిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. తెలుగులోని గొప్ప రచనలను ఇతర భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థుల్లో ఆనువాదం పట్ల ఉన్న భయాన్ని తొలగించి అనువాదం ఎంత సులభం చేయవచ్చో చిన్న చిన్న కథల ద్వారా తెలియజేయాలని అధ్యాపకులకు సూచించారు. రచయిత రావూరి సీతారామారావు ’వచన కవితా బోధన వ్యూహాల’పై మాట్లాడుతూ.. విద్యార్థికి కవిత్వాన్ని తెలుపుతూనే వారిలో సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. కవి, విమర్శకుడు గండ్ర లక్ష్మణరావు ’పద్య బోధన– మెలకువలు’ అనే ఆశంపై మాట్లాడారు. తెయూ మాజీ రిజిస్ట్రార్ కనకయ్య మాట్లాడుతూ.. సాహిత్యం సమాజం యొక్క ప్రతిబింభమని, సాహిత్యంలో ఉన్న ప్రక్రియల పట్ల అధ్యాపకులకు అవగాహన ఉండాలన్నారు. నిర్వాహకురాలు కరిమండ్ల లావణ్య, సంస్థ కార్యదర్శి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
గ్రహీత వారాల ఆనంద్
తెయూలో కొనసాగుతున్న
పునశ్చరణ తరగతులు
Comments
Please login to add a commentAdd a comment