అత్యాచారానికి యత్నించిన వ్యక్తి రిమాండ్
పెద్దకొడప్‌గల్(జుక్కల్): ఓ వివాహితపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై మహేందర్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని బేగంపూర్ గ్రామంలో ఈనెల 15న గ్రామానికి చెందిన పెండ్యాల విజయ్ కుమార్ అదే గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా, ఆమె కేకలు వేసింది. వెంటనే స్థానికులు అతడిని పట్టుకోవడానికి వెంటపడగా తప్పించుకున్నాడు. అనంతరం వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విజయ్ కుమార్ బేగంపూర్ గ్రామ శివారులో ఉండగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
కల్లు దుకాణంపై దాడి
వర్ని: మోస్రా మండల కేంద్రంలోని సుభాష్‌గౌడ్ కల్లు దుకాణంపై శుక్రవారం ఒక వర్గం వారు దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈమేరకు వారు వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు గౌడకులస్తులు అకారణంగా కల్లు దుకాణంపై దాడి చేసి పెట్టెలు, కల్లును ధ్వంసం చేసినట్లు బాధితుడు వాపోయాడు.
వైన్స్ దుకాణంలో చోరీ
పిట్లం(జుక్కల్): మండలంలోని మద్దెల చెరువు గ్రామంలో గల వైన్స్ దుకాణంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వైన్స్ షాప్ షెట్టర్లు శుక్రవారం ఉదయం కొద్దిగా తెరిచిఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, చోరీ జరిగిన తీరును పరిశీలించారు. రూ. 2వేల నగదు, కొన్ని మద్యం సీసాలు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో డ్రైవర్.. బోల్తా పడ్డ ఆటో
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని కామిశెట్టిపల్లి వద్ద గల జాతీయ రహదారిపై శుక్రవారం ట్రాలీ ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కామిశెట్టిపల్లిలోని జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు వద్ద బాన్సువాడ నుంచి నిజామాబాద్ వెళుతున్న ట్రాలీ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌కు ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎస్సై లావణ్య ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. డ్రైవర్‌కు డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం మత్తులో ఆటో నడపడంతో ప్రమాదం జరిగిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ హరిచంద్, భాను, బుజ్జి తదితరులు ఉన్నారు.
రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్ నమోదు
ఖలీల్‌వాడి: నగరంలోని రౌడీ షీటర్ అమర్ అలీఖాన్ అలియాస్ బర్సత్ అమెర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్‌చార్జి సీపీ సింధూశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఖిల్లా చౌరస్తాలో అతడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని, కత్తి, పల్సర్ బైక్, రెండు స్మార్ట్ మొబైల్స్ స్వా ధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతడిపై ఆరో టౌన్‌లో రౌడీ షీట్ ఉండగా హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గతంలో ఏకే–302 పేరుతో ఓ ముఠాను సైతం నిర్వహించినట్లు తెలిపారు. నిందితుడు పలు కేసుల్లో వాంటెడ్‌గా ఉండగా, పరారీలో ఉండటంతో అతడిపై పీడీ చట్టం అమలు చేసి, అరెస్టు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment