తాళం వేస్తే ఇల్లు గుల్లే..
నిజామాబాద్ రూరల్: నగర మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల్లో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాళం వేసిన ఇళ్లనే దుండగులు టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతుండటంతో ప్రజలు ఇళ్లకు తాళం వేసి, వెళ్లాలంటే జంకుతున్నారు.
ఇదీ పరిస్థితి..
రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్‌నగర్, గూపన్‌పల్లి, మారూతీనగర్‌లలో గత నెల రోజులుగా తాళం వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేసుకోని చోరీలకు పాల్పడుతున్నారు. పది హేను రోజుల కిందట ముబారక్‌నగర్‌లోని ఆలయంలో దొంగలు హుండీని పగులు కొట్టి నగదును దోచుకెళ్లారు. నాలుగు రోజుల క్రితం ముబారక్‌నగర్‌లోని రెండిళ్లలో దుండగులు చొరబడి 11 తులాల బంగారం చోరీ చేశారు. విలీన గ్రామాల్లో గత సంవత్సరంలో దాదాపు 10 ఇళ్లను దొంగలు దోచుకుని పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణలు చేపట్టారు. కానీ ఆయా ఘటనల్లో పోలీసులు ఇప్పటికీ ఎవరినీ అదుపులోకి తీసుకున్న దాఖలాలు లేవు.
పెట్రోలింగ్ కరువు..
ప్రస్తుతం శుభకార్యాలతోపాటు సెలవులు వస్తుండటంతో ప్రజలు దూరప్రయాణాలు చేయాల్సివస్తోంది. కానీ వరుస చోరీలతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నేరాల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతోపాటు పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగ తనాలు జరుగున్న ప్రాంతాలు అన్నీ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్నా, చోరీలు జరగడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి, విలీన గ్రామాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, చోరీల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
విలీన గ్రామాల్లో దొంగల హల్‌చల్
భయాందోళనలో ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment