ఆడ, మగ సాగు.. ఆదాయం మెండు
రెంజల్(బోధన్): ఆడ, మగ రకం వరి సాగుకు బోధన్ నియోజకవర్గంలో ఆదరణ పెరుగుతోంది. కంపెనీలు పోటీపడి రైతులతో ఒప్పందం చేసుకుంటున్నాయి. పలు కంపెనీలు రైతులను నూతన పద్ధతులను ప్రోత్సహిస్తు పంట సాగును పెంచుతున్నాయి. రైతులతో ఒప్పందం చేసుకొని విత్తనోత్పత్తి నుంచి పంట నూర్పిడి వరకు అవసరమైన సలహాలు, సూచనలను ఆయా కంపెనీల ప్రతినిధులు అందిస్తున్నారు. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు పండిస్తే రూ.80 వేల నుంచి రూ. 90 వేల వరకు, పది క్వింటాళ్ల కంటే ఎక్కువ పండిస్తే అదనంగా క్వింటాకు ధరను చెల్లిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. విత్తనంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణంలో మార్పులు వచ్చి చీడపీడలు వచ్చి పంట దిగుబడి తగ్గినా రైతుకు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లిస్తున్నారు. రైతు నిర్లక్ష్యంతో కలుపుతీత, బెరుకులు వస్తే కంపెనీ ప్రతినిధులు ధర తగ్గించి తీసుకుంటారు. పలు రకాల వైరెటీలను రైతులు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు ఒక్కో కంపెనీ నిబంధనల ప్రకారం వారి సూచించిన విధంగా సాగు చేయాల్సి ఉంటుంది.
ఎక్కువ కష్టం
సాగు పద్ధతుల్లో ఎక్కువ కష్టం ఉన్నా అందుకు తగిన విధంగా ఆదాయం రైతుకు లభిస్తుంది. సాధారణ వరి రకాలకు ఎకరాకు రూ.25 నుంచి రూ.35 వేల వరకు ఆదాయం వస్తే ఈ పద్ధతిలో సాగు చేసిన పంటకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందవచ్చు. ప్రత్యేక పద్ధతుల ద్వార చివరి వరకు రైతు దగ్గరుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆడ, మగ విత్తనాలకు వేర్వేరుగా నారుమడులు వేయాల్సి ఉంటుంది. ముందుగా మగ రకం నారు మడి వేసిన వారం రోజులకు ఆడ రకం నారుమడిని సిద్ధం చేయాలి. 21 రోజుల్లో నాట్లు ప్రారంభించాలి.
నాటు ప్రత్యేకత
ఆడ, మగ నాటు ప్రత్యేకంగా ఉంటుంది. నారుమడి వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం కర్రలు, తాళ్లతో కొలతలు చేసి రెండు లైన్లను మగ, మధ్యలో ఐదు లైన్లను ఆడ రకం నారు నాటాలి. ఎక్కడా లోపం ఏర్పడినా ధాన్యం మొత్తం తాళుగా మారుతుంది. పూత దశలో ఈ రెండింటిని సంకరం చేయాల్సి ఉంటుంది. చేతికి వచ్చిన తర్వాత ముందుగా మగ వరి సాళ్లను కోసి పక్కన పెడతారు. తర్వాత ఆడ వరిలో బెరుకులు ఉంటే తొలగించాలి. కంపెనీలు కేవలం ఆడ ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తాయి. మగ రకం ధాన్యాన్ని రైతులు ఇష్టం వచ్చిన వారికి విక్రయించుకోవచ్చు.
సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు
రైతులతో ఒప్పందం
చేసుకుంటున్న కంపెనీలు
Comments
Please login to add a commentAdd a comment