జగిత్యాల: మిఠాయిలు పంపిణీ చేస్తున్న శివమారుతిరెడ్డి కుటుంబ సభ్యులు
కరీంనగర్/కోరుట్ల: వాళ్లు లక్ష్య సాధనపైనే దృష్టి సారించారు.. కృషి, పట్టుదలతో చదివారు.. ఒకసారి తప్పినా మరోసారి మరింత కసి పెంచుకున్నారు.. తల్లిదండ్రులు, పెద్దల ప్రోత్సాహంతో ముందుకు కదిలారు.. అకుంఠిత దీక్షతో ముందుకెళ్లారు సివిల్స్‌లో ర్యాంకులు సాధించారు.. విజయానికి పేదరికం, ఆర్థిక పరిస్థిలు అడ్డుకాదని నిరూపించారు.
‘సివిల్స్ అనేది ఓ తపస్సు లాంటిది.. ఎన్ని గంటలు, ఎంతసేపు చదివామన్నది కాదు.. ఎంత విషయ పరిజ్ఞానం పెంపొందించుకున్నామనేదే ముఖ్యం’ అని సివిల్స్–2022 ఫలితాల్లో ఆల్ ఇండియాలో 94వ ర్యాంకు సాధించిన ఆవుల సాయికృష్ణ్ణ అన్నారు. ఉన్నత చదువులకు పేదరికం, ఆర్థిక పరిస్థితులు కారణాలు కావని పేర్కొన్నారు. కంటెంట్ కాదు.. క్వాలిటీ ముఖ్యమని... చదువుకుంటున్న రోజుల్లో కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేసిన సుమితా డావ్రా స్ఫూర్తన్నారు.
కరీంనగర్, హైదరాబాద్‌లో చదువు..
కరీంనగర్ పారమిత పాఠశాల, ఇంటర్మీడియట్ హైదరాబాద్ నారాయణ కళాశాల, ఇంజినీరింగ్ వరంగల్ నీట్‌లో సాగింది. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న ఆవుల లక్ష్మయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ సునీత గృహిణి. సోదరుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. రెండో ప్రయత్నంలోనే 2017 బ్యాచ్‌లో 728వ ర్యాంక్ సాధించిన. మినిస్టరీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ రీజినల్ డైరెక్టర్ (ఎస్‌ఈఆర్), హైదరాబాద్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నా. ఎలాగైనా ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో ఆరోసారి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించా.
మార్గదర్శకులు...
ఎస్‌ఈఆర్‌లో నా సీనియర్ తక్కళ్లపల్లి యశ్వంత్‌రావు సూచనలు, సలహాలు పాటించా. ఎన్ని గంటలు చదివామన్నది కాకుండా.. ఏ మేరకు విషయ పరిజ్ఞానం అవలోకనం జరిగిందో తెలుసుకోని విశ్రమించకుండా, తక్షశిల కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ మార్గదర్శనం ఎంతో ఉపయోగపడింది.
Comments
Please login to add a commentAdd a comment