మల్యాల(చొప్పదండి): అడుగు తీసి..అడుగు వేయలేని ఏడు పదుల వయసులో చేతిలో ఓ సంచి.. అందులో తమ్ముడికి కట్టే రాఖీ.. ఓ చీరతో అక్క ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి బయల్దేరింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ అనుబంధ గ్రామమైన కొత్తపల్లికి చెందిన సామల భాగ్యవ్వ(70) తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచివెళ్లింది.
సామల భాగ్యవ్వ భర్త గణపతి నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. చెల్లెలు లక్ష్మి మహారాష్ట్రలో ఉంటోంది. తమ్ముడు గౌడ మల్లేశం తన సొంతూరు గంగాధర మండలం కొండన్నపల్లిలో జీవిస్తున్నాడు. రాఖీ పండగకు రాఖీ కట్టాలనే తపనతో ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న తమ్ముడి ఇంటికి రాఖీ కట్టేందుకు చెర్లపల్లె, కురుమపల్లెల మీదుగా సుమారు రెండు గంటలపాటు నడిచి వెళ్లి కొండన్నపల్లె చేరుకోవడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
రాఖీ పండుగ రోజు గురువారం తమ్ముడి మల్లేశంకు రాఖీ కట్టి, రాఖీ పండుగ ప్రాముఖ్యతను చాటిచెప్పింది. ఏటా అక్క భాగ్యవ్వ తన కోసం నడుచుకుంటూ తమ ఇంటికి వస్తుందని, రాఖీ కట్టిన అనంతరం బండిపై తీసుకెళ్లి, కొత్తపల్లెలో దింపుతానని మల్లేశం తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment