యువకుడి మృతి
నిద్ర మత్తు వల్లే ప్రమాదం
సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
మర్రిపల్లిలో విషాదం
వేములవాడరూరల్: రాత్రి సమయంలో ప్రయాణం వద్దు కొడుకా అని తల్లి చెప్పినప్పటికీ వినలేదు.. ఏం కాదమ్మా తెల్లవారేసరికి హైదరాబాద్‌లో ఉంటా.. అంటూ బైక్‌పై వెళ్లిన ఓ యువకుడు దారిలో బావి వద్ద నిద్రించి, ప్రమాదవశాత్తు అందులోనే పడి మృతిచెందాడు.. ఈ ఘటన వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లిలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిపల్లికి చెందిన రాచర్ల మల్లేశం–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు కౌశిక్(23) హైదరాబాద్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
సెలవులకు ఇంటికి వచ్చి, తిరిగి గురువారం రాత్రి 8 గంటలకు బైక్‌పై హైదరాబాద్ బయల్దేరాడు. తల్లి వద్దని చెప్పినా వినిపించుకోకుండా తెల్లవారేసరికి అక్కడుంటానంటూ వెళ్లాడు. సిద్దిపేట జిల్లా ఇమాంబాద్ వద్ద ప్రధాన రోడ్డు పక్కన వాహనాన్ని ఆపాడు. హెల్మెట్, బ్యాగు అక్కడే పెట్టి బావి పక్కన ర్యాంప్‌పై నిద్రించాడు. నిద్ర మత్తులో ప్రమాదవశాత్తు బావిలో పడి, చనిపోయాడు.
ఉదయం గమనించిన స్థానికులు బైక్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకొని, మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా బావిలో శవమై తేలాడు. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు కౌశిక్ మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. అతను వాహనాన్ని ఆపడం, ర్యాంప్‌పై నిద్రించడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయినట్లు గుర్తించారు. అనంతరం పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కౌశిక్ మరణ వార్త విన్న అతని స్నేహితులు, గ్రామస్తులు విషాదంలో మునిగారు.
Comments
Please login to add a commentAdd a comment