కరీంనగర్: తాను చదివే కాలేజీకి చెందిన ఉద్యోగి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని జాతీయ మహిళా కమిషన్, ఎస్సీ,ఎస్టీ కమిషన్, శాతవాహన వర్సిటీ అధికారులకు చేసిన ఫిర్యాదుపై విచారణ ముగిసింది. వివిధ కమిషన్లు, యూనివర్సిటీ ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు అంతర్గతంగా పలువురు ఫ్రొఫెసర్లతో అంతర్గత విచారణ కమిటీని ఇటీవల యూనివర్సిటీ నియమించింది. ఈ కేసు జిల్లాలో సంచలనం కావడం, పోలీసు కేసు కూడా నమోదవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిటీ విచారణ పూర్తవడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల ఫిర్యాదు చేసిన మహిళా విద్యార్థినిని కమిటీ సభ్యులు పలుమార్లు విచారించారు. అదే సమయంలో కమిటీ సభ్యులు సదరు కాలేజీలో పర్యటించి, సిబ్బందిని, తోటి విద్యార్థులను విచారించినట్లు తెలిసింది. విచారణలో తాము సేకరించిన వివరాల ఆధారంగా రూపొందించిన నివేదికను సీల్డ్ కవర్‌లో ఉన్నతాధికారులకు పంపించారు.
కక్ష సాధింపు చర్యనా?
ఫిర్యాదు చేసిన విద్యార్థిని వెనక ఎవరు ఉన్నారన్నది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. అదే కళాశాలకు చెందిన ఓ సీనియర్ ఉద్యోగి సదరు విద్యార్థినిని ఈ వ్యవహారంలో తప్పుదోవ పట్టించినట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం తాను కక్షసాధించే క్రమంలో ఈ వ్యవహారంలో కలగజేసుకుని, జాతీయస్థాయికి పెంచి విషయాన్ని భూతద్దంలో చూపినట్లు సమాచారం. అదే సమయంలో ఇది రెండు కాలేజీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరా? లేక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న కక్ష సాధింపు చర్యనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ కమిటీ వచ్చిన సమయంలో ఆ తరగతిలోని మిగిలిన విద్యార్థులంతా కూడా కమిటీకి తమ తమ నివేదికలను లిఖిత పూర్వకంగా ఇచ్చారని తెలిసింది. అందులో వారు ఏం రాశారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగానికి ఎన్నికై న వ్యక్తికి ఎలాగైనా ఆ ఉద్యోగం రానీయకుండా కొందరు పన్నిన కుట్రగా కళాశాల సిబ్బంది అభివర్ణిస్తున్నారు.
సీల్డ్ కవర్‌లో నివేదిక పంపిన ప్రత్యేక కమిటీ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment