తెలంగాణ సంస్కృతి గొప్పది
కరీంనగర్‌కల్చరల్: తెలంగాణ సంస్కృతి గొప్పదని హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య వెలదండ నిత్యానందరావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన శరత్ సాహితీ కళాస్రవంతి రజతోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నిర్వాహకులు ఎంపిక చేసిన ముగ్గురు కవులకు నగదు పురస్కారాలు ఇచ్చి సన్మానించారు. ఒక సాహితీ సంస్థ రజతోత్సవాలు జరుపుకోవడం సాహిత్య రంగంలోనే సంచలనాత్మక విషయమని, వందలాది కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, సాహిత్య సదస్సులు నిర్వహించి చరిత్ర చాటుకున్నదని వక్తలు అభినందించారు. ఈ సందర్భంగా ఆరు పుస్తకాలు ఆవిష్కరించారు. బహుభాషావేత్త డా.నలిమెల భాస్కర్ మాట్లాడుతూ తాను గతంలో బెంగాలీ రచనలను తెలుగులోకి అనువాదం చేసినట్లు తెలిపారు. అనంతరం బెంగాళీ రచయిత్రి కావేరి చటర్జికి సబ్బని నాగమ్మ–మల్లేశం స్మారక పురస్కారం, వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావుకు సంకేపల్లి కాంతయ్య, కమలమ్మ స్మారక సాహిత్య పురస్కారం, ప్రముఖ రచయిత డా.పి.రమేశ్ నారాయణకు అనువాద పురస్కారాలు అందజేశారు. అలాగే సంస్థ అధ్యక్షుడు డా.సబ్బని లక్ష్మీనారాయణ రాసిన ఐదు గ్రంథాలు ఆవిష్కరించారు. వితరణ శీలి కొండూరు జగన్మోహనరావు మౌన సముద్రం తెలుగు గ్రంథాన్ని, కావేరి చటోపాధ్యాయ సైలెంట్ ఒషన్ గ్రంథం, నా చారుధాం యాత్రా చరిత్ర, సమీక్షలు–విమర్శలు, అవ్వ గ్రంథాలను కర్నాటక కేంద్రియ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బట్టు సత్యనారాయణ, అవ్వ అనువాద ఫ్రెంచ్, జపనీస్ గ్రంథాలను డా.మచ్చ హరిదాస్, గులాబీల మల్లారెడ్డి ఆవిష్కరించారు. సంస్థ కార్యదర్శి సంకేపల్లి నాగేంద్రశర్మ రాసిన మిడ్‌మానేర్ కవితా సంకలన గ్రంథాన్ని ఆచార్య నిత్యానందరావు ఆవిష్కరించారు. హిందీ రచయితలు సుస్మా త్రిపాఠి, శేఖర్ త్రిపాఠి, సాహితీ వేత్తలు మాడిశెట్టి గోపాల్, కేఎస్ అనంతాచార్య, సాహితీవేత్తలు డా.బొద్దుల లక్ష్మయ్య, డా.ఇమ్మడోలు భద్రయ్య, వెలమల జైపాల్‌రెడ్ది, మర్రిపల్లి మహేందర్, ఎలగొండ రవి, బూర్ల దేవానందం, డా.వైరాగ్యం ప్రభాకర్, తంగెడ నవనీతరావు, ఉప్పల రామేశం, సురేందర్‌రెడ్ది తదితరులను నిర్వాహకులు సన్మానించారు. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య పి.ఉమేశ్‌కుమార్, జాతీయ స్వాతంత్య్ర సమర యోధుల వారసుల సంఘం అధ్యక్షుడు బోయినపల్లి హన్మంతరావు, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కలకుంట్ల రామకృష్ణ, ప్రముఖ పాత్రికేయుడు పీఎస్ రవీంద్ర, యువకవి తండా హరీశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి నిత్యానందరావు
Comments
Please login to add a commentAdd a comment