దరఖాస్తుల ఆహ్వానం
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు వైద్య కళాశాల వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి వివరాలతో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు, 2 జతల జిరాక్స్‌లతో కొత్తపల్లిలోని కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని సూచించారు. ప్రొఫెసర్–4, అసోసియేట్ ప్రొఫెసర్–8, అసిస్టెంట్ ప్రొఫెసర్ –3 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు www.gmcknr. com/gmcknr.html వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
పంట డబ్బులు ఇస్తలేరు
● బ్యాంకు ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
ధర్మపురి: భూమి పట్టాదారు పుస్తకాలు కుదువపెట్టి ఓ రైతు బ్యాంకులో రుణం తీసుకున్నాడు. కొద్దికాలానికి చనిపోయాడు. అతని కొడుకు భూమి సాగు చేసుకోగా.. పంట డబ్బులు బ్యాంకులో పడ్డాయి. ఆ డబ్బులను బ్యాంకర్లు ఇవ్వడం లేదని సదరు వ్యక్తి బ్యాంకు ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత రైతు మల్లేశ్ వివరాల ప్రకారం.. జిల్లాలోని బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన సోమ రాజయ్య ధర్మపురిలోని సహకార కేంద్ర బ్యాంకులో భూమి పట్టాపాసు పుస్తకం కుదవపెట్టి రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కిస్తీకి రూ.55 వేల చొప్పున ఒకసారి చెల్లించాడు. రాజయ్య ఇటీవల చనిపోయాడు. బ్యాంకులో ఇంకా రూ.2.92 లక్షల అప్పు ఉంది. అతని కొడుకు మల్లేశం పంట సాగు చేయగా వచ్చిన డబ్బులు రూ.3 లక్షలు బ్యాంకులో పడ్డాయి. మీరేమాకు అప్పు ఉన్నారంటూ వాటిని బ్యాంకు అధికారులు ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్ గురువారం బ్యాంకు ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకొని నీళ్లు పోశారు. మల్లేశ్ మూసిఉన్న బ్యాంకు అద్దాలను బలంగా గుద్దడంలో చేతికి తీవ్ర గాయమైంది. అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై బ్యాంకు ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్‌ను వివరణ కోరగా ‘గతంలో మల్లేశ్ తండ్రి తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లించక ఇబ్బందులు పెట్టారు. ప్రస్తుతం వచ్చిన పంట డబ్బులు మల్లేశ్ తల్లి శంకరమ్మ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఆ డబ్బులను ఇరువురి సంతకాలతో అప్పుకింద తీసుకున్నాం. రూ.8 వేలు వారికి ఇవ్వాల్సి ఉంది. రాజయ్య చనిపోయినట్లు ధ్రువపత్రాలు తీసుకొస్తే ఇస్తాం’ అని సమాధానం ఇచ్చారు.
ఒకరి రిమాండ్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఉమెన్స్ సేఫ్టీలో భాగంగా మండలంలోని రామన్నపల్లిలో బుధవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై బి.రామ్మోహన్ తెలిపారు. గ్రామంలోని ఐకేపీ సెంటర్‌లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న గుండి ప్రశాంత్‌ను పోలీస్ సిబ్బంది ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడంతో పాటు నెట్టివేసినట్లు తెలిపారు. కానిస్టేబుల్ ప్ర శాంత్ ఫిర్యాదుతో గుండి ప్రశాంత్‌పై కేసు నమోదుచేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 15 రోజు ల జ్యూడీషియల్ రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కేసు
సారంగాపూర్: సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన బంక చిన్నక్క అనే మహిళను చంపుతానని బెదిరించిన బాలపల్లి గ్రామానికి చెందిన గుంటి కనుక మల్లేశ్‌పై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై దత్తాద్రి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. చిన్కక్కకు గ్రామ శివారులో గల వ్యవసాయ భూమిలోకి మల్లేశ్ అక్రమంగా ప్రవేశించి హద్దురాళ్లు, కరెంటు ప్యూజులు తొలగించాడు. ఈ క్రమంలో తమ భూమిలోకి వచ్చి హద్దురాళ్లు ఎందుకు తొలగించావని ప్రశ్నించినందుకు చిన్నక్కను మల్లేశ్ చంపుతానని బెదిరించాడు. చిన్నక్క పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment