సౌదీ బాధితుడిపై స్పందించిన సీఎంవో
జగిత్యాలక్రైం: వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలో చిక్కుకున్న జగిత్యాలకు చెందిన కుక్కల చిన్న భీమయ్యను ఇండియాకు వాపస్ తెప్పించాలని అతని భార్య గంగలక్ష్మి ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డికి మెయిల్ ద్వారా బుధవారం విజ్ఞప్తి చేయగా.. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పందించింది. సాధారణ పరిపాలనశాఖ ప్రవాసీ భారతీయుల విభాగం (జీఏడీ– ఎన్నారై) ముఖ్య కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి ‘వెర్ మెసేజ్’ పంపారు. భీమయ్య కుమారుడు సునీల్‌కు ‘బోన్‌మ్యారో’ (ఎముక మూలుగు) మార్పిడి చికిత్స కోసం దాతగా భీమయ్యను సౌదీ నుంచి అత్యవసరంగా రప్పించాల్సి ఉంది. కాగా, కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఎక్స్‌లో చేసిన విజ్ఞప్తికి కూడా రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. సౌదీలోని సామాజిక సేవకులు గాజుల నరేష్, మీర్జా బేగ్, మహ్మద్ ఫారూఖ్ అహ్మద్‌లు స్థానిక అధికారులతో, ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment