వీల్‌చైర్లు లేవు... పేషెంట్ కేర్‌లు సరిపోరు!
● సహాయకులే వీల్‌చైర్లు తోసుకెళ్లే పరిస్థితి ● ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వీల్ చైర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఉన్న వీల్ చైర్లను తోసుకెళ్లడానికి సరిపడా పేషెంట్ కేర్స్ లేకపోవడంతో రోగులతో వచ్చిన సహాయకులే వీల్‌చైర్ తోసుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో రోగులు, వారితో వచ్చిన సహాయకులు ఆసుపత్రి సేవలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సరిపడా లేని వీల్‌చైర్లు...
ప్రభుత్వ ప్రధానాసుపత్రికి ప్రతీరోజు సుమారు 800 నుంచి 1000 మంది వరకు ఔట్ పేషెంట్ సేవలు పొందుతుంటారు. వీరిలో 50 మంది వరకు నడవలేని స్థితిలో వైద్యం కోసం ఆసుపత్రికి వస్తుంటారు. ఇలాంటి వారికి తప్పనిసరిగా వీల్‌చైర్ అవసరం. కానీ.. ఆసుపత్రిలో ఉండే అరకొర వీల్‌చైర్లు పది మందికి కూడా సరిపోవడం లేదు. మిగతా వారంతా ఇంటి వద్ద నుంచి తెచ్చుకునే స్టాండులు పట్టుకొని ఇబ్బందులు పడుకుంటూ నడుస్తూ వస్తుంటారు. కొంత మంది పేషెంట్లను సహాయకులే మోసుకు వస్తున్నారు.
పేషెంట్ కేర్‌లు ఇతర అవసరాలకు...
జిల్లా ఆసుపత్రిలో పేషెంట్లకు సహాయకులుగా ఉండాల్సిన పేషెంట్ కేర్‌లను ఇతర పనులకు పురమాయించడంతో నడవలేని పేషెంట్లను ఆసుపత్రిలోకి తీసుకువచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పేషెంట్ల సేవలో ఇద్దరు, ముగ్గురే పేషెంట్ కేర్స్ ఉండడంతో మిగతా వీల్‌చైర్లను పేషెంట్ల సహాయకులే నెట్టుకొని వెళ్తున్నారు. ఏజిల్ సంస్థ ద్వారా పేషెంట్ కేర్లను సరిపడా కేటాయించాలని నిబంధన ఉన్నప్పటికీ వారందరికీ ఇతర పనులను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వీల్ చైర్లు ఆర్డర్ పెట్టాం
ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. సిక్ పేషెంట్లకు సరిపడా వీల్‌చైర్లు లేకపోవడంతో ఆర్డర్ పెట్టాం. త్వరలోనే సమకూరుస్తాం. ఇంకా కొన్ని డొనేషన్ రూపంలో వచ్చేవి ఉన్నాయి. పేషెంట్‌కేర్స్‌ను సరిపడా నియమించి పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– వీరారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment