● 20 పనులకు సింగిల్ బిడ్ దాఖలు
కరీంనగర్ కార్పొరేషన్: ప్రత్యేక నిధులు(ఎస్‌డీఎఫ్)తో నగరంలో చేపట్టనున్న పనులకు సంబంధించిన టెండర్‌లో కాంట్రాక్టర్లు సిండికేట్ అయినట్లు సమాచారం. నగరపాలకసంస్థ పరిధిలో ఎస్‌డీఎఫ్ కింద రూ.1.31 కోట్లతో చేపట్టనున్న 38 పనులకు సంబంధించి గతంలో ఈ–పొక్యూర్ టెండర్ పిలిచారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు కొన్నిచోట్ల హైమాస్ట్ లైట్లు కూడా ఈపనుల్లో ఉన్నాయి. కాగా ఎస్‌డీఎఫ్ పనులకు సంబంధించిన టెండర్ గడువు గురువారంతో ముగిసింది. ఈ టెండర్‌లలో కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారనే ప్రచారం సాగుతోంది. గురువారం పలువురు కాంట్రాక్టర్లు నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలో మిగతా వారితో మంతనాలు సాగించి, పనులు పంచుకున్నట్లు సమాచారం. పనుల్లో కొన్నింటికి కేవలం ఒక్కబిడ్ మాత్రమే దాఖలు కావడం ఈ ప్రచారానికి బలంచేకూరుస్తోంది. పనుల్లో స్థానిక కాంట్రాక్టర్లే టెండర్లకు మొగ్గుచూపుతుండడంతో, ఆన్‌లైన్ టెండర్ అయినా సిండికేట్‌కు అవకాశం ఏర్పడింది. కాగా మొత్తం 38 పనులకు మూడు పనులకు సంబంధించి బిడ్ దాఖలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోగా, 35 పనులకు స్పందన వచ్చింది. 35 పనుల్లో 20 పనులకు సంబంధించి సింగిల్ బిడ్ మాత్రమే దాఖలైంది. కాంట్రాక్టర్ల నడుమ కుదిరిన ఒప్పందం మేరకే 20 పనులకు సింగిల్ బిడ్ దాఖలైనట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలాఉంటే శాతవాహన అర్బన్ డెవలెప్‌మెంట్ (సుడా) నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించిన టెండర్ శుక్రవారంతో ముగియనుంది. ఇందులో కూడా కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యారనే ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment