ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నరు
● హామీలు అమలు చేసేవరకు పోరాటం చేస్తాం ● హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
కరీంనగర్: రాష్ట్రంలో ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి, 13 నెలలు గడిచినా ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతోపాటు 420 హామీలు అమలు చేసేవరకు పోరాటం చేస్తామన్నారు. గురువారం కరీంనగర్ ఎమ్మెల్యే మీసేవ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ–కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ, తులం బంగారం, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నారని తెలిపారు. ఈ–కార్ రేస్ కోసం వివిధ రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ ఉందని, దాన్ని తట్టుకొని కేటీఆర్ తెలంగాణకు తీసుకొస్తే... రేవంత్ రెడ్డి రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ సమావేశంలో తాను ఆర్డీవో గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కానీ, తనపై ఆరుగురితో కేసులు పెట్టించారని పేర్కొన్నారు. ఖమ్మంలో హరీశ్‌రావుపై దాడి జరిగితే కేసులు ఎందుకు పెట్టలేదని, కేసీఆర్ ఇచ్చిన బీ–ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యే సంజయ్‌ని నిలదీస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసులకు తాము భయపడమని, చట్ట ప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్‌ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్‌కుమార్, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, చెల్లోజి శ్రీనివాస్, దూలం సంపత్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment